తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు ఆగడం లేదు. తాజాగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో విహారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది.
హైదరాబాద్ బీరంగూడ నుంచి నెల్లూరు జిల్లా కొండాపురానికి బయలుదేరిన బస్సు, రాత్రి ప్రయాణంలో ఉన్నప్పుడు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా బస్సును పక్కకు ఆపడంతో 29 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ముందుగా చౌటుప్పల్ వద్ద టీ బ్రేక్ కోసం ఆగిన బస్సు, ప్రమాదం జరిగే 10 నిమిషాల ముందు బయలుదేరిందని చెబుతున్నారు. ఆ విరామం కారణంగా ప్రయాణికులు మెలకువగా ఉండి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులు, బస్సులో ఫైర్ సేఫ్టీ పరికరాల లేమి, ఫిట్‌నెస్ లేని వాహనాల నడిపింపు పై ఆవేదన వ్యక్తం చేస్తూ, అధికారుల నుంచి కఠిన చర్యలు కోరుతున్నారు.




