Home South Zone Andhra Pradesh ఎన్టీఆర్ జిల్లా పదవ తరగతి ఉత్తీర్ణతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి...

ఎన్టీఆర్ జిల్లా పదవ తరగతి ఉత్తీర్ణతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస

0

*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 16, 2025*

*ప‌క‌డ్బందీగా 100 రోజుల కార్యాచ‌ర‌ణ*
– *ప్ర‌తి విద్యార్థిపైనా ప్ర‌త్యేక దృష్టిపెట్టండి*
– *ప్ర‌గ‌తిపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ త‌ప్ప‌నిస‌రి*
– *పదో తరగతి ఉత్తీర్ణ‌త‌లో జిల్లాను అగ్ర‌గామిగా నిల‌పాలి*
– *జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

జిల్లాలో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు మంచి ఫ‌లితాలు సాధించి, జిల్లాను అగ్ర‌గామిగా నిలిపేందుకు 100 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను ప‌క‌డ్బందీగా అమ‌లుచేయాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు.
ఈ నెల ఆరో తేదీన ప్రారంభ‌మైన 100 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక అమ‌లుపై క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో విద్యాశాఖ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఎంఈవోలు కూడా వ‌ర్చువ‌ల్‌గా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ 187 ప్ర‌భుత్వ యాజ‌మాన్య పాఠ‌శాల‌ల్లోని ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులపై ప్ర‌గ‌తి ఆధారంగా ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని.. కౌన్సెలింగ్‌తో పాటు మోటివేష‌న్ త‌ర‌గ‌తులు కూడా నిర్వ‌హించాల‌న్నారు. జీవితంలో కెరీర్‌తో పాటు ఉన్న‌తంగా ఎద‌గ‌డంలో చ‌దువు ప్రాధాన్య‌త‌ను వివ‌రించాల‌న్నారు. ఆత్మ‌విశ్వాసాన్ని పెంపొందించేలా ప్ర‌త్యేక త‌ర‌గ‌తుల‌తో చేయిప‌ట్టి న‌డిపించాల‌న్నారు. ప్ర‌తిరోజు స్లిప్ టెస్ట్‌లు నిర్వ‌హించాల‌ని.. వీటిని విశ్లేషించి ఎక్క‌డ వెనుక‌బ‌డి ఉన్నారో ప‌రిశీలించి, ఆయా అంశాల్లో మెరుగుప‌డేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రైజింగ్ స్టార్స్.. షైనింగ్ స్టార్స్‌గా ఎదిగేలా చూడాల‌న్నారు. జిల్లా అక‌డ‌మిక్ ఫోరం, మండ‌ల అక‌డ‌మిక్ ఫోరం నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తో విద్యార్థులు ప్ర‌గ‌తి దిశ‌గా ప‌య‌నించి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో మంచి మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించేలా చేయూత‌నందించాల‌న్నారు. ఇంట‌రాక్టివ్ సెష‌న్స్ కూడా నిర్వ‌హించి.. ప్ర‌గ‌తి సాధ‌న‌కు ఉన్న అడ్డంకుల‌ను తొల‌గించేందుకు కృషిచేయాల‌న్నారు. ప్ర‌తి పాఠ‌శాల‌కు ఒక ప్ర‌త్యేక అధికారి ఉంటార‌ని.. ఈ ప్ర‌త్యేక అధికారి ఎప్ప‌టిక‌ప్పుడు పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించి, దిశానిర్దేశం చేయాల‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు బంగారు భ‌విష్య‌త్తును ఇవ్వాల‌నే ఉద్దేశంతో అవ‌స‌ర‌మైన అన్ని వ‌న‌రుల‌ను అందుబాటులో ఉంచుతోంద‌ని.. వీటిని స‌ద్వినియోగం చేసుకునేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.
స‌మావేశంలో డీఈవో ఎల్‌.చంద్ర‌క‌ళ‌, స‌మ‌గ్ర‌శిక్ష అధికారి ఎం.ర‌జ‌నీ కుమారి, ఏపీఎస్‌డ‌బ్ల్యూఆర్ఈఐఎస్ డీసీవో ఎ.ముర‌ళీకృష్ణ‌, ఎంఈవోలు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

NO COMMENTS

Exit mobile version