మహిళలకు గుడ్ న్యూస్..
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రయాణికులకు ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇవాళ(ఆదివారం) ప్రజా భవన్లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం సంక్షేమ పథకాల అమలుపై కీలక సూచనలు చేశారు.
లాభాల్లోకి ఆర్టీసీ: మల్లు భట్టి విక్రమార్క
మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రూ.255 కోట్ల ట్రిప్స్ పూర్తి అయ్యాయని పేర్కొన్నారు.
పీఎం ఈ- డ్రైవ్ కింద హైదరాబాద్‌కు 2,800 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, నిజామాబాద్, వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించామని తెలిపారు. ఆర్టీసీ పీఎఫ్ బకాయిలు రూ.1,400 కోట్ల నుంచి రూ.660 కోట్లకు తగ్గించామని పేర్కొన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం తొలి రోజునే పుస్తకాలు, యూనిఫాంలు, షూస్ పంపిణీకి చర్యలు చేపట్టామని తెలిపారు. నాయీ బ్రాహ్మణ, రజక సంఘాలకు ఉచిత విద్యుత్ బిల్లుల నెలవారీ విడుదల చేస్తున్నామని అన్నారు.
100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ఒకేసారి అనుమతి ఇచ్చామని.. ఇందుకోసం కార్పొరేట్ స్థాయి భవనాల నిర్మాణం చేస్తున్నామని వివరించారు. గురుకులాల కోసం రూ.152 కోట్లు విడుదల చేశామని తెలిపారు. 30 వేల కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
