మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్యా తండాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న తండాలో జరిగిన వీరన్న హత్యకు ప్రతీకారంగా మృతుడి బంధువులు అనుమానితుల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. వీరన్న హత్యకు కారకులుగా అనుమానిస్తున్న తండాకు చెందిన RMP వైద్యుడు భరత్, బాలు ఇళ్లపై దాడులు చేశారు.
భరత్ కు చెందిన బైక్, కిరాణా షాప్ను మృతుడి బంధువులు దగ్ధం చేశారు. మరో అనుమానితుడు బాలు ఇంటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తండా వాసులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాటకు దారితీసింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు తండాలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
