Home South Zone Andhra Pradesh ‘చేయి వీడని చెలిమి’ నవల ఆవిష్కరణ |

‘చేయి వీడని చెలిమి’ నవల ఆవిష్కరణ |

0

దివ్యాంగ రచయిత్రి సాయిజ్యోతి నవల ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
వాయిస్ ఇన్‌పుట్ టెక్నాలజీతో పుస్తకాలు రాస్తున్న సాయిజ్యోతి
మంగళగిరికి చెందిన రచయిత్రిని అభినందించిన మంత్రి
యువతరానికి స్ఫూర్తిగా నిలిచారని లోకేశ్ ప్రశంస.

పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే వైకల్యం ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు మంగళగిరికి చెందిన విభిన్న ప్రతిభావంతురాలు చింతక్రింది సాయిజ్యోతి. అంధత్వాన్ని జయించి, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని రచయిత్రిగా మారిన ఆమె, తాజాగా ‘చేయి వీడని చెలిమి’ అనే నవలను రచించారు. ఈ నవలను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సాయిజ్యోతి తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిజ్యోతి అసాధారణ ప్రతిభను, ఆమె కృషిని మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు.

మంగళగిరి 26వ వార్డుకు చెందిన సాయిజ్యోతి, పుట్టుకతో వచ్చిన అంధత్వంతో ఏమాత్రం కుంగిపోలేదు. మొబైల్ ఫోన్‌లోని వాయిస్ ఇన్ పుట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తనలోని సృజనాత్మకతకు అక్షర రూపం ఇస్తున్నారు. ‘చైత్రశ్రీ’ అనే కలం పేరుతో ఆమె ఇప్పటికే ‘కవితాంజలి’ అనే కవితా సంపుటిని, ‘మంచుతాకిన ప్రేమ’, ‘ఎవరు అతను’ వంటి నవలలను పాఠకులకు అందించారు.

కేవలం కల్పిత కథలే కాకుండా, సామాజిక స్ఫృహ కలిగించే అనేక కథలను కూడా ఆమె రచించారు. ప్రస్తుతం ఆమె నూతక్కి హైస్కూల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు తనలోని రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. శారీరక వైకల్యాన్ని సంకల్ప బలంతో అధిగమించి, తన ప్రతిభతో యువతరానికి సాయిజ్యోతి స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. ఆధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని రచయిత్రిగా రాణించడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, సాయిజ్యోతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version