నష్టాలు నివారించేందుకు అమ్మకాల్లో మార్పులకు శ్రీకారం
రోజువారీ ధరలు, దర్శన టికెట్ ఉన్నవారికే డాలర్లు అమ్మేలా కొత్త విధానం
ఒకరికొకటి మాత్రమే, పాన్ కార్డు నిబంధన అమలుకు ప్రణాళిక
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో విక్రయించే శ్రీవారి బంగారం, వెండి డాలర్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. బయట మార్కెట్ ధరలతో పోలిస్తే టీటీడీ డాలర్ల ధరలు తక్కువగా ఉండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు భక్తులు ఎగబడటంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి విక్రయ కౌంటర్‌ను మూసివేశారు.
గత కొంతకాలంగా బంగారం ధరలు ఆకాశాన్నంటున్నాయి. అయితే, టీటీడీ నిబంధనల ప్రకారం డాలర్ల ధరలను వారానికి ఒకసారి (ప్రతి మంగళవారం) మాత్రమే సవరిస్తారు. కానీ, బులియన్ మార్కెట్‌లో ధరలు రోజూ మారుతుండటంతో టీటీడీకి ఆర్థికంగా నష్టం వాటిల్లుతోంది. ఈ వ్యత్యాసాన్ని గమనించిన భక్తులు 5 గ్రాములు, 10 గ్రాముల డాలర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. దీంతో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఈ నష్టాలను నివారించి, విక్రయాల్లో పారదర్శకత పెంచేందుకు టీటీడీ కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఇకపై తిరుపతి బులియన్ మార్కెట్‌కు అనుగుణంగా రోజువారీ ధరలను ప్రకటించి డాలర్లను విక్రయించాలని భావిస్తోంది. అంతేకాకుండా శ్రీవారి దర్శనం టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే ఒక డాలర్ చొప్పున అమ్మాలని యోచిస్తోంది. రూ.50 వేలు దాటిన కొనుగోళ్లకు పాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చి, డాలర్ల విక్రయాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
