మంగళగిరి క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటాయి. ఉత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన దివ్య కల్యాణ మహోత్సవం సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు దేవస్థాన ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వేడుకలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ పవిత్ర కల్యాణాన్ని భక్తులు వేలాదిగా తరలివచ్చి తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మంత్రి దంపతులకు ఘనస్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.










