మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిఖ్ విలేజ్ దోభీఘాట్ లో రజకసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బానిస బతుకులకు,వెట్టిచాకిరికి, భూస్వాములు, జమిందారుల దోపిడీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాడిన తీరును కొనియాడారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాట పటిమ కలిగిన మహిళ అని, భూస్వాములు జమీందారుల ఇళ్లల్లో బలహీన వర్గాల మహిళలు వెట్టి చాకిరి చేసేవారని ఆ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ గారు పోరాడారని చెప్పారు.
రైతులు తాము పండించిన పంటను జమీందారులు, భూస్వాములు, దళారులు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సి వచ్చేదని, దానితో రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యేవారని, ఆ దోపిడీకి వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం చేశారని, ఆమె పోరాటపటిమ నేటి తరాలకు స్ఫూర్తి దాయకమని ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చాకలి ఐలమ్మ ప్రాధాన్యతను గుర్తుంచుకుని, భావి తరాలకు వారి ఖ్యాతిని తెలియజేయడం కోసం కోఠి లోని మహిళా యూనివర్సిటీకి వారి పేరు పెట్టి “చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ” గా నామకరణం చేశారని, ఇది చాకలి ఐలమ్మ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధని తెలిపారు. ఈ జయంతి కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సి.ఇ.ఓ మధుకర్ నాయక్ గారు,కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, రజకసంఘం నాయకులు సోమన్న,కృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju