సికింద్రాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఆటోడ్రైవర్ల జీవనం అగమ్య గోచరంగా మారిందని మాజీ మంత్రి,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, రానున్న రోజుల్లో లక్ష మంది ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. బన్సీలాల్ పేట్ జబ్బార్ కాంప్లెక్స్ వద్ద ఆటో డ్రైవర్లతో ముఖా ముఖి అయిన తలసాని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జబ్బార్ కాంప్లెక్స్ నుండి రాణిగుంజ్ వరకు ఆటోను నడిపారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ఆటో రిక్షా కార్మికులు గత రెండు సంవత్సరాల నుండి పేదరికంలో మగ్గుతున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ప్రయాణాన్ని ఉచితంగా కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ పొట్ట కొట్టిందని ఆక్షేపించారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12000 ఇస్తామని మోసపూరిత హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ నెరవేర్చింది లేదని అన్నారు. చేతకాని హామీలను ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు తలుచుకుంటే ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తారని వారి ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుందని వెల్లడించారు.
Sidhumaroju
