విశాఖలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. 130 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లోనే మంటలు భారీగా ఎగసిపడి బస్సు పూర్తిగా దగ్ధమైంది. టైర్లు పెద్ద శబ్దాలతో పేలిపోవడంతో పరిసరాల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.
బస్సు వెనుక వస్తున్న ఓ ఆటో డ్రైవర్ బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగుతున్నట్టు గమనించి వెంటనే బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేశాడు. డ్రైవర్ చాకచక్యంతో బస్సును హైవే పక్కకు ఆపి, ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్లతో ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం కూర్మన్నపాలెం నుంచి బయలుదేరిన బస్సులో అక్కయ్యపాలెం శాంతిపురం హైవే వద్ద జరిగింది. మంటల సమయంలో బస్సు సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
పోలీసులు అప్రమత్తమై పెట్రోల్ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయమని సూచించారు.
సమయానికి స్పందించిన డ్రైవర్, ఆటో డ్రైవర్, ఫైర్ సిబ్బంది చాకచక్యంతో 130 మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. అయితే, బస్సు పూర్తిగా కాలిపోయి భారీ ఆస్తినష్టం జరిగింది.
