మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : జిల్లా న్యాయ సేవల అథారిటీ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వారి ఆధ్వర్యంలో శనివారం జిల్లా న్యాయస్థానాల భవన సముదాయం, కుషాయిగూడ లో ప్రత్యేక లోక్ అదాలత్ (ప్రజా న్యాయస్థానం) కార్యక్రమం నిర్వహింపబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హై కోర్ట్ న్యాయ సేవల కమిటీ చైర్మన్ & మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ K. లక్ష్మణ్ హాజరయినారు.
ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్ మాట్లాడుతూ 1977 నుండి అపరిష్కృతంగా వున్న కుటుంబ తగాదా కు సంబంధించిన కేసు లోక్ అదాలత్ తోనే పరిష్కారం అయ్యి నా చేతుల మీదుగా జడ్జిమెంట్ అవార్డు అందించడం సంతోషాన్నిచ్చింది అన్నారు.
ప్రత్యేక ప్రజా న్యాయస్థానం (లోక్ అదాలత్) లో పరస్పర రాజీ తో కక్షి దారులకు సత్వర న్యాయం జరగడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. జ్యూడిషరీ విభాగంలో అధునాతన నవీకరణ లో భాగంగా వచ్చిన ఈ – కోర్ట్ లు, లైవ్ స్ట్రెమింగ్స్, 18 భాషల్లో తీర్పులను వెబ్ సైట్ లలో అప్లోడ్ చేయడం శుభపరిణామమని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ..
ఇరు వర్గాల వారు రాజీ కుదుర్చుకోవటం వలన ఖర్చు లేకుండా సమస్యకు పరిష్కారం తో ఉపశమనం పొందవచ్చని, లోక్ అదాలత్ ద్వారా కక్షి దారులు సమస్యలు నేరుగా చెప్పుకుని అర్థవంతమైన, నిష్పక్షపాతమైన ఉచిత న్యాయ సేవలు త్వరితగతిన పొందవచ్చని, ఆర్థికంగా బలహీనంగా వున్నవర్గాలు ఇట్టి మెరుగైన సేవలు ఉపయోగించుకోవాలని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపుల్ సెషన్ జడ్జ్ శ్రీదేవి, జడ్జిలు, డీసీపీ లు పద్మజారెడ్డి, సుధీర్ బాబులు, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju




