సికింద్రాబాద్ : జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం వద్ద వారి 108 వ జయంతి కార్యక్రమం స్ధానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ దేశానికి వారు చేసిన సేవలను కొనియాడి, వారి స్పూర్తితోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందని చెప్పారు. అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ..
శ్రీమతి ఇందిరా గాంధీ చిన్నతనంలోనే తండ్రి నెహ్రూ, మహాత్మా తో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని, వారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారని, భారతదేశం ఆహారాన్ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి భారత దేశ అవసరాలకు సరిపోను ఆహారాన్ని ఉత్పత్తి చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి తీసుకువచ్చారని, పాకిస్తాన్ పై యుద్ధం చేసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసిన ఘనత కూడా శ్రీమతి ఇందిరా గాంధీ గారికి దక్కుతుందని, ఆ యుద్ధ సమయంలో అమెరికా మాటలు కూడా ఖాతరు చేయలేదని, భారతదేశ సార్వభౌమత్యాన్ని కాపాడిన వ్యక్తి ఇందిరాగాంధీ అన్నారు,
దేశంలో 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయకరణ చేసి సంపన్న వర్గాలకే పరిమితమైన బ్యాంకులను పేద ప్రజలు కూడా బ్యాంకులకు వెళ్లే విధంగా చేసిన మహనీయురాలని, అందుకే ఆమెను ఉక్కు మహిళ అంటారని, భారతదేశానికి
మొదటి, ఏకైక మహిళా ప్రధానిగా గుర్తింపు పొందారని వారి స్ఫూర్తితోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందని, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పం కూడా ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే వచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Sidhumaroju






