ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించేందుకు అర్హులైన కౌలు రైతులకు పీఏసీఎస్‌ల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందించనుంది. ఈ పథకం ద్వారా రైతులు పెట్టుబడి భరోసా పొంది, అప్పుల ఊబి నుండి బయటపడతారు.
ఇది రాష్ట్ర వ్యవసాయ రంగానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. రుణం ఎంత ఇస్తారు..? మళ్లీ ఎప్పుడు తిరిగి చెల్లించాలి..? అనే వివరాలు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్‌లో పంటలు సాగు చేసే కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేయాల్సిన దుస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలవాలని నిర్ణయించింది. వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యం అర్హులైన కౌలు రైతులకు రూ.లక్ష వరకు రుణాలు ఇచ్చేందుకు అధికారికంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ చొరవ ద్వారా కౌలు రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసి వారి సాగుకు పెట్టుబడి భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.
తక్కువ వడ్డీకి పీఏసీఎస్‌ల ద్వారా రుణాలు
ఈ రుణ సహాయ పథకాన్ని అమలు చేయడానికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను కీలక సంస్థలుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడం వల్ల వారు ప్రైవేటు అప్పుల భారం నుంచి విముక్తి పొందగలరు. ప్రస్తుతం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతుల వివరాలు సేకరించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ వివరాల సేకరణ పూర్తయిన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ రుణాలు విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చుల వంటి ముఖ్యమైన వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడతాయి.
అర్హతలు – ముఖ్య నిబంధనలు
రూ.లక్ష వరకు రుణం పొందడానికి కౌలు రైతులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలి. లబ్ధిదారులు సంబంధిత అధికారుల నుంచి జారీ చేయబడిన కౌలు పత్రాలు కలిగి ఉండాలి. అలాగే వారు సహకార సంఘం పరిధిలో నివాసం ఉంటూ ఆ సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలి. రుణానికి దరఖాస్తు చేసే రైతు కౌలు పత్రంలో చూపించిన సాగు భూమి ఎకరాకు తగ్గకుండా ఉండాలనే నిబంధన ఉంది. అయితే అసైన్డ్ భూములు సాగు చేస్తున్న కౌలు పత్రాలు ఉన్నవారు ఈ రుణానికి అర్హులు కారు. సొంత ఇల్లు ఉన్నవారికి ఈ రుణ మంజూరులో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. రుణం పొందిన తేదీ నుంచి ఒక సంవత్సరం లోపు అసలు, వడ్డీని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
వ్యవసాయ రంగానికి ఊతం
కొత్త ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య కేవలం కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక బలమైన ఊతమిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కౌలు రైతులు ధైర్యంగా పెట్టుబడి పెట్టి, పూర్తి స్థాయిలో పంటలు పండించడానికి ఈ రుణాలు ప్రేరణగా నిలుస్తాయి. ఈ ప్రాజెక్టు అమలు వివరాలపై, రుణాలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై ప్రభుత్వం త్వరలోనే పూర్తి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
#SivaNagendra




