*ఇంధన పొదుపుతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు..*
– *మహోద్యమంగా ఇంధన పొదుపును ముందుకు తీసుకెళ్దాం*
– *నికర శూన్య ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకుందాం*
– *ప్రతిఒక్కరూ ప్రొడ్యూమర్‌గా మారాల్సిన అవసరముంది*
– *గౌరవ సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా సమష్టిగా కృషిచేద్దాం*
– *ఇంధన సంరక్షణలో వరుస అవార్డులతో రాష్ట్రానికి నూతనుత్తేజం*
– *ఏపీ జెన్‌కో ఎండీ ఎస్.నాగలక్ష్మి, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
సమష్టి భాగస్వామ్యంతో ఇంధన పొదుపుతో స్వర్ణాంధ్ర @ 2047 దిశగా అడుగులు వేద్దామని.. మహోద్యమంగా ఇంధన పొదుపును ముందుకు తీసుకెళ్దామని ఏపీ జెన్‌కో ఎండీ ఎస్.నాగలక్ష్మి, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు-2025 (డిసెంబర్ 14-20)లో భాగంగా సోమవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వరకు జరిగిన ర్యాలీ, స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఏపీ జెన్‌కో ఎండీ ఎస్.నాగలక్ష్మి, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్, ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి, నెడ్‌క్యాప్ వీసీ, ఎండీ కమలాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఏపీ సీపీడీసీఎల్.. బీఈఈ సౌజన్యంతో స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన
కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, పవర్ యుటిలిటీ డైరెక్టర్లు తదితరులతో కలిసి జాతీయ ఇంధన పొదుపు పోస్టర్లను ఆవిష్కరించారు. అత్యంత విలువైన విద్యుత్ ఏ రూపంలోనూ వృధా కాకుండా ఎల్లప్పుడూ జాగ్రత్తగా వ్యవహరిస్తానని.. విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరేలా పాటుపడతానంటూ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా జెన్‌కో ఎండీ నాగలక్ష్మి మాట్లాడుతూ వ్యక్తులు, పారిశ్రామిక సంస్థలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు.. ఇలా ప్రతిఒక్క వ్యక్తి, సంస్థా ఇంధన పొదుపు దిశగా పయనించాలని.. భవనాలు కూడా హరిత ప్రమాణాలను పాటించాలని కోరారు. ఇప్పటికే 1,400 వరకు వాణిజ్య భవంతులు ఇంధన పొదుపు ప్రమాణాలను పాటిస్తున్నాయన్నారు. గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా ప్రతిఒక్కరూ ప్రొడ్యూమర్ (ప్రొడ్యూసర్ ప్లస్ కన్జ్యూమర్)గా ఎదగాలన్నారు. నికర శూన్య ఉద్గారాలు (నెట్ జీరో ఎమిషన్) అనేది స్వర్ణాంధ్ర విజన్‌లో ఒక లక్ష్యమని.. దీని సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాల్సిన అవసరముందని, ఇంధన పరిరక్షణ, సామర్థ్యంలో ఏపీ వరుసగా జాతీయస్థాయి అవార్డులు సొంతం చేసుకుంటోందని.. సమష్టి కృషే ఇందుకు నిదర్శనమని ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు.
*ప్రతి ఇల్లూ సూర్యఘర్ కావాలి: కలెక్టర్ లక్ష్మీశ*
ఇంధనాన్ని వృధా చేస్తే డబ్బును వృధా చేసినట్లేనని.. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తెరిగి సేవ్ ఎనర్జీ – సేవ్ మనీ నినాదాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటూ ఇంధన పొదుపును పాటించాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. విద్యుత్‌ను ఆదా చేసే గృహోపకరణాలను వినియోగించడం ద్వారా 25 – 30 శాతం విద్యుత్‌ను ఆదా చేయొచ్చన్నారు. మీరు వినియోగించుకోగా అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌కు ప్రభుత్వం నుంచి తిరిగి డబ్బు పొందేందుకు వీలుకల్పించే పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
*ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్ మాట్లాడుతూ* ఇంధన పొదుపును ప్రతిఒక్కరూ తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని.. సౌర, పవన తదితర పునరుత్పాదక ఇంధన వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యకర పర్యావరణాన్ని భావితరాలకు బహుమతిగా అందిద్దామన్నారు. మనకు ఎంత అవసరమో అంతే విద్యుత్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు.
*ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి మాట్లాడుతూ..* విద్యుత్ లేనిదే అడుగు కూడా ముందుకేయలేని పరిస్థితి అని.. నాణ్యమైన విద్యుత్‌ను సరసమైన ధరలకు అందించినప్పుడే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ దాదాపు 13 వేల మెగావాట్లు కాగా.. ఏటా ఇది ఏడు నుంచి 10 శాతం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో విద్యుదుత్పత్తితో పాటు విద్యుత్ పొదుపును కూడా అలవరచుకోవాల్సిన అవసరముందన్నారు. ఒక యూనిట్‌ను ఆదా చేస్తే రెండు యూనిట్లను ఉత్పత్తి చేసేనట్లేనని పేర్కొన్నారు.
*నెడ్‌క్యాప్ వీసీ, ఎండీ కమలాకర్ బాబు..* మాట్లాడుతూ విద్యుత్ పరిరక్షణలో ఏపీ నెం.1గా ఉంటోందని, మిషన్ మోడ్‌లో విద్యుత్ పొదుపు కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఇంధన పొదుపు చర్యలతోనే భావితరాలకు ఇంధన భద్రత సాధ్యమవుతుందన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు ఇంధన వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ర్యాలీలు, సమావేశాలు తదితరాలతో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాజాత ప్రదర్శనలతో విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించారు. విద్యార్థులు, పవర్ యుటిలిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)




