*చాలీచాలని వేతనాలతో వీఆర్ఏల ఆవేదన*
*వీఆర్ఏల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు*
*గ్రామ రెవెన్యూ సహాయకుల్లో అసంతృప్తి ఉధృతి*
*వీఆర్ఏలకు తెలంగాణ తరహా పే స్కేల్ అమలు చేయాలి*
*నామినీలు గా పనిచేస్తున్న అందరిని వీఆర్ఏగా నియమించాలి*
*అర్హులందరికీ 70 శాతం ప్రమోషన్స్ ఇవ్వాలి*”
*కారణ్య నియామకాలకు త్వరితచర్యలు*
*ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ*
*కరోనా సేవలను విస్మరించిన వైసీపీ ప్రభుత్వం: వీఆర్ఏల ఆవేదన*
*కరోనా సమయంలో వాలంటరీలకు చప్పట్లు… వీఆర్ఏలపై జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం*
గ్రామ రెవెన్యూ సహాయకుల ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, గత ప్రభుత్వ పాలనలో వీఆర్ఏలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని,చాలీచాలని వేతనాలతో పనిచేయాల్సి రావడంతో వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం బాలకాశి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మంగళగిరి ఆటోనగర్ లో గల సీసీఎల్ఏ కార్యాలయం వద్ద మహా ధర్నా నిర్వహించారు. సీసీఎల్ఏ కార్యాలయ అధికారులకు గ్రామ రెవెన్యూ సహాయకుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లా సుమారు 20 వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకులు గ్రామ రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారని తెలిపారు. వీరికి 2018లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో పదివేల 500 వేతనం పెరిగిందని, అప్పటినుండి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పెరగలేదని వారు అన్నారు. గత ప్రభుత్వంలో విఆర్ఏలు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురి అయ్యారని కేవలం రూ 10,500 రూపాయల వేతనంతో వీఆర్ఏల కుటుంబాలు బ్రతకడం నేటి పరిస్థితుల్లో కష్టదాయకంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది కాలంగా అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, సమస్యలపై సానుకూల స్పందన రాలేదన్నారు.ప్రస్తుతం వీఆర్ఏలకు కేవలం రూ.10,500 వేతనం మాత్రమే అందుతుండటంతో జీవనం భారంగా మారిందన్నారు. గత ప్రభుత్వంలోనూ వేతనాల పెంపు జరగలేదని పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రతి గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని వినతులు ఇచ్చామని, రెవెన్యూ మంత్రికి కూడా వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు.ఈ నేపథ్యంలో అనివార్యంగా ధర్నా చేపట్టామని తెలిపారు. తెలంగాణ తరహాలో పేస్కేల్ అమలు, నామినల్ వీఆర్ఏల నియామకం, కారుణ్య నియామకాలు, అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే నిర్వాదిక సమ్మెకు సిద్ధమని హెచ్చరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్‌లో కీలక విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రత్యేక అలవెన్సులు, పే స్కేలు లేకుండా కేవలం రూ.10,500 వేతనంతో జీవనం సాగిస్తున్నామని వారు తెలిపారు. నామినేలుగా పనిచేస్తున్న అందరిని వీఆర్ఏ లుగా నియమించాలని వారు డిమాండ్ చేశారు. అర్హులందరికీ 70% ప్రమోషన్ ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏ కుటుంబాలలో అర్హులకు కారుణ్య నియామకాలను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు…గత ప్రభుత్వం ఐదేళ్లు, ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లు గడిచినా తమ సమస్యలు పరిష్కరించలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్, రెవెన్యూ మంత్రి లకు పలుమార్లు వినతులు ఇచ్చినా స్పందన లేదన్నారు. తెలంగాణలో 18 వేల వీఆర్ఏలను పూర్తి స్థాయి ఉద్యోగులుగా నియమించి పే స్కేలు అమలు చేసినట్లు గుర్తు చేస్తూ, అదే విధంగా ఏపీలో కూడా జీవోలు జారీ చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు.డిమాండ్లు నెరవేరకపోతే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో సమ్మెకు దిగుతామని వారు
హెచ్చరించారు.
*వీఆర్ఏల సేవలను విస్మరించిన జగన్ ప్రభుత్వం*
సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి వీఆర్ఏల వ్యవస్థను దిగజార్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వీఆర్ఏలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలో ఎన్నో దశాబ్దాలుగా సేవలందిస్తున్న వీఆర్ఏల ప్రాధాన్యతను తగ్గిస్తూ సచివాలయ వ్యవస్థను అమలు చేయడం అన్యాయమని వారు విమర్శించారు.కరోనా మహమ్మారి సమయంలో వీఆర్ఏలు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందించారని, గ్రామాల్లో పర్యవేక్షణ, సమాచార సేకరణ, ప్రభుత్వ ఆదేశాల అమలు వంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించారని తెలిపారు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం వారి సేవలను గుర్తించకుండా వాలంటరీ వ్యవస్థను మాత్రమే ప్రోత్సహిస్తూ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటరీలకు చప్పట్లు కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.కరోనా సంక్షోభంలో వీఆర్ఏల పాత్రను విస్మరించడం బాధాకరమని వారు పేర్కొన్నారు.తమ సేవలకు తగిన గుర్తింపు, హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
*వీఆర్ఏల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం: సీసీఎల్ఏ అధికారులు*
గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) ఎదుర్కొంటున్న పలు సమస్యలు, వారి ప్రధాన డిమాండ్లకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని సీసీఎల్ఏ అధికారులు స్పష్టం చేశారు. వీఆర్ఏల సేవా భద్రత, వేతనాలు, విధి నిర్వాహణకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర పెండింగ్ సమస్యలను సమగ్రంగా వివరించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు.ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుని అధికారిక ఉత్తరం జారీ చేస్తామని సంబంధిత అధికారులు తెలియజేసినట్లు సీసీఎల్ఏ కార్యాలయం అధికారులు వెల్లడించారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల దృష్టితో ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.వీఆర్ఏల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని సీసీఎల్ఏ అధికారులు సానుకూలంగా స్పందించారు.ఈ మహా ధర్నా కార్యక్రమంలో ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎన్ పెద్దన్న, వైస్ చైర్మన్ లు టి అంజి, ఎన్ నాగేశం మర్రి వెంకటేశ్వర్లు సూర్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం బాలకాశి,ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు,సిపిఐ మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ రెవిన్యూ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.




