Wednesday, December 17, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఏపీ వర్క్స్ బోర్డ్ ఏడాది కాలం పనితీరు దేశానికి ఆదర్శం

ఏపీ వర్క్స్ బోర్డ్ ఏడాది కాలం పనితీరు దేశానికి ఆదర్శం

విజయవాడ, 16-12-2025

– ఏపీ వక్ఫ్ బోర్డ్ ఏడాది కాలం పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచింది.

– రాష్ట్రవ్యాప్తంగా 953 నోటీసులు జారీ చేసి, 820 ఎకరాల వక్ఫ్ భూమిని రక్షించేందుకు చర్యలు చేపట్టాం.

– 650 కోట్ల విలువైన వక్ఫ్ భూమి విషయంలో జరిగిన 89 అక్రమ సేల్ డీడ్ల ను రద్దు చేయించాం.

– గత ఏడాదితో పోలిస్తే రూ.3.50 కోట్ల అదనపు ఆదాయం సాధించాం.

– డిజిటలైజేషన్ వలన అదనంగా 15,618 ఎకరాల వక్ఫ్ భూమిని గుర్తించగలిగాం.

విజయవాడ కాళేశ్వర రావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 9 వ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ మేరకు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. తాను బాధ్యతలు చేపట్టిన 17-12-2024 నుంచి 17-12-2025 వరకు వక్ఫ్ పాలనలో పూర్తిస్థాయి పారదర్శకత, చట్టబద్ధత, బాధ్యతాయుత పరిపాలన తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వక్ఫ్ ఆస్తుల రక్షణే ప్రధాన లక్ష్యంగా అక్రమ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 953 అక్రమ ఆక్రమణ నోటీసులు జారీ చేసి, దాదాపు 820 ఎకరాల వక్ఫ్ భూమిని రక్షించేందుకు చర్యలు చేపట్టామని, వీటి విలువ సుమారు రూ.2,000 కోట్లు ఉంటుందని తెలిపారు. అలాగే, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు రూ.650 కోట్ల విలువైన వక్ఫ్ భూమి విషయంలో జరిగిన 89 అక్రమ సేల్ డీడ్ల ను రద్దు చేయించామని తెలిపారు. వక్ఫ్ బోర్డు చరిత్రలో తొలిసారిగా ఈ-టెండరింగ్ విధానం అమలు చేసి, హుండీలు, వాణిజ్య ఆస్తుల ద్వారా గణనీయమైన ఆదాయం సమకూర్చామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే రూ.3.50 కోట్ల అదనపు ఆదాయం సాధించి, దాదాపు 46 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేసినట్లు వెల్లడించారు. సంక్షేమ రంగంలో భాగంగా ఇమామ్‌లు, మౌజాన్లకు పెండింగ్‌లో ఉన్న 18 నెలల గౌరవ వేతనాలను రూ.1.35 కోట్లతో పూర్తిగా చెల్లించామని తెలిపారు. పేద ముస్లిం మహిళల కోసం తలీమ్-ఎ-హునర్ వంటి నూతన పథకాలు ప్రారంభించడంతో పాటు, విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేయబోతున్నామని చెప్పారు. ఉమీద్ పోర్టల్ ద్వారా వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలిచిందని తెలిపారు. వక్ఫ్ భూమి విస్తీర్ణం 65,784 ఎకరాల నుంచి 81,402 ఎకరాలకు పెరిగిందని, అదనంగా 15,618 ఎకరాల వక్ఫ్ భూమిని గుర్తించగలిగామని పేర్కొన్నారు. అలాగే 100 శాతం వక్ఫ్ ఆస్తుల నమోదు పూర్తయ్యిందని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు పరిపాలనలో ఇకపై ఎలాంటి అక్రమాలకు తావు లేదని, వక్ఫ్ ఆస్తుల రక్షణ, అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, మంత్రివర్యులు నారా లోకేష్ సహకారంతో వక్ఫ్ బోర్డును మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

వక్ఫ్ ఆస్తులు దేవునికి అంకితం చేసిన పవిత్ర ఆస్తులని, వాటి ఆదాయంతోనే పేదల సంక్షేమం, విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే పూర్వీకులు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం వక్ఫ్ బోర్డు నిర్వహణ మొత్తం 7% ఆదాయంతోనే సాగుతోందని, ఈ మొత్తం జీతాలు, పరిపాలనా ఖర్చులకే సరిపోతుందని తెలిపారు. మిగిలిన 93% ఆదాయాన్ని స్థానిక కమిటీలు, ముత్తావలీలు సమాజ సంక్షేమానికి వినియోగించాల్సిన బాధ్యత తీసుకోవాల్సి ఉందన్నారు.
సరైన లీజులు, రీ-అగ్రిమెంట్లు లేకపోవడం వల్ల వక్ఫ్ ఆస్తులు అన్యాకాంతం కావడానికి ప్రధాన కారణమని, అందుకే వ్యవసాయ భూములు, కమర్షియల్ షాపులు అన్నింటికీ సరైన లీజ్ ఒప్పందాలు తప్పనిసరి చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చామని ఆయన వివరించారు. ఐదు లక్షల రూపాయలకు పైగా ఆదాయం ఉన్న వక్ఫ్ సంస్థలకు తప్పనిసరిగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం చేస్తున్నామని తెలిపారు. వక్ఫ్ ఆస్తులు దేవుని ఆస్తులని, వాటి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ అవసరమని, అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

*జారీ చేసినవారు: సంచాలకులు సమాచార పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్*

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments