*మహిళా క్రికెటర్ శ్రీచరణికి నగదు ప్రోత్సాహకం అందజేత*
*శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్ ను అందజేసిన మంత్రి నారా లోకేష్*
అమరావతి: మహిళల వన్డే ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సహకాన్ని అందజేసింది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో క్రికెటర్ శ్రీచరణిని కలిసిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆమెకు చెక్ ను అందజేశారు. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి అంతర్జాతీయ క్రికెట్ లో రాణిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సహకాలు ప్రకటించింది. రూ.2.5 కోట్ల మేర నగదు ప్రోత్సాహంతో పాటు విశాఖలో 500 గజాల విస్తీర్ణం గల ఇంటి స్థలాన్ని కేటాయించింది.
డిగ్రీ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 హోదా ఉద్యోగాన్ని కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, క్రీడా శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, శాప్ ఎండీ భరణి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ డి.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ బి.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




