Home South Zone Andhra Pradesh ఎన్టీఆర్ జిల్లా అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ |

ఎన్టీఆర్ జిల్లా అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ |

0

*ఎన్. టి. ఆర్ . జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, ఎన్. టి. ఆర్. జిల్లా.*
*పత్రికా ప్రకటన* *తేదీ. 18.12.2025.*
*అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.*
*ఏకాలంలో రెండు ప్రదేశాలలో దాడులు 10 మంది అరెస్ట్.*
*వారి వద్ద నుండి అమ్మకానికి ఉన్న ఐదుగురు పిల్లలు మరియు 3 లక్షల 30 వేల రూపాయల నగదు స్వాదీనం.*

నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. వి. రాజా శేఖర బాబు ఐ. పి. ఎస్. గారికి రాబడిన పక్కా సమాచారం మేరకు ది.01.03.2025 తేదిన అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న విజయవాడ, సితార సెంటర్ ఏరియాకు చెందిన బగళం సరోజినీ మరో నలుగురు మహిళలను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి విక్రయించడానికి ఉంచిన ముగ్గురు పిల్లలను స్వాదీనం చేసుకుని, ఒక బాబుని విక్రయించగా వచ్చిన నాలుగు లక్షల రూపాయలను స్వాదినం చేసుకుని వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. అనంతరం వారు విక్రయించిన మరో ముగ్గురు పిల్లలను కూడా రికవరీ చేయడం జరిగిందని సంగతి విదితమే…

ఈ క్రమంలో పై ముద్దాయిలు అయిన బగళం సరోజినీ @ బలగం సరోజినీ (31 సం.) మరియు షేక్ ఫరీనా (26 సం.) లు జైలు నుండి బెయిలుపై విడుదలైనారు. వీరి కదలికలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ నేపధ్యంలో నిన్న అనగా ది.17.12.2025 తేదిన సాయంత్రం నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. వి. రాజా శేఖర బాబు ఐ. పి. ఎస్. గారికి రాబడిన పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏ.సి.పి శ్రీమతి కె. లతాకుమారి గారు, పశ్చిమ ఎ.సి.పి. శ్రీ ఎన్.వి.దుర్గా రావు గారు, నార్త్ ఏ. సి. పి. శ్రీమతి స్రవంతి రాయ్ గార్ల ఆద్వర్యంలో టాస్క్ ఫోర్స్, భవానిపురం మరియు నున్న ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో కలిసి ఏక కాలంలో దాడులు నిర్వహించి భవానిపురం కుమ్మరి పాలెం సెంటర్ సమీపంలో ఐదుగురుని మరియు నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉడాకాలని ఏరియాలో ముగ్గురుని అదుపులోనికి తీసుకుని విచారించి వారి వద్ద నుండి విక్రయించడానికి ఉంచిన నలుగురు పిల్లలను మరియు 3 లక్షల 30 వేల రూపాయల నగదు స్వాదీనం చేసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగింది.

ప్రధాన నిందితురాలు సరోజినీ ఇచ్చిన సమాచారంపై ఈ రోజు ఉదయం టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిదిలో ఇద్ధరు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని మరో పాపను రెస్కూ చేయడం జరిగింది.
*నిందితుల వివరాలు:*
*భవానిపురం పోలీస్ స్టేషన్: Cr.No 584/2025 U/s 143 BNS, 81,87 of JJ Act*
1. విజయవాడ, సితార సెంటర్ ఏరియాకు చెందిన బగళం సరోజినీ @ బలగం సరోజినీ (31 సం.)
2. విజయవాడ భవానిపురం గొల్లపూడి ఏరియాకు చెందిన గరికముక్కు విజయలక్ష్మి(41 సం.)
3. విజయవాడ భవానిపురం, కుమ్మరిపాలెం ఏరియాకు చెందిన వాడపల్లి బ్లేస్సి (30 సం.)
4. తెలంగాణా, నాంపల్లి, ఘట్కేసరి ఏరియాకు చెందిన ముక్తిపేట నందినీ (30 సం.)
5. గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామానికి చెందిన షేక్ బాబా వలి (28 సం.)

*నున్న పోలీస్ స్టేషన్ : Cr.No 506/2025 U/s 143 BNS, 81,87 of JJ Act*
1. విజయవాడ దుర్గా పురం ఏరియాకు చెందిన ఆమదాల మణి (49 సం.)
2. విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఏరియాకు చెందిన షేక్ ఫరీనా (26 సం.)
3. విజయవాడ కబేలా సెంటర్ ఏరియాకు చెందిన ఐరి వంశి కిరణ్ కుమార్ (29 సం.)

*కొత్తపేట పోలీస్ స్టేషన్ : Cr.No 489/2025 U/s 143 BNS, 81,87 of JJ Act*
1. విజయవాడ గుణదల ఏరియాకు చెందిన శంక యోహాన్ (46 సం.)
2. విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలానికి చెందిన పతి శ్రీనివాసరావు (52 సం.)

వివరాల్లోకి వెళితే.. విజయవాడ సితార సెంటర్ కు చెందిన బలగం సరోజినీ సులభంగా డబ్బులు సంపాదించడానికి పిల్లలు లేని వారికి అక్రమంగా పిల్లలను విక్రయించడం ఎంచుకుంది. ఈ క్రమంలో డిల్లీ కి చెందిన కిరణ్ శర్మ అనే అమ్మాయిని మరియు ముంబాయి కి చెందిన కవిత, నూరి, సతీష్ అనే వారిని పరిచయం చేసుకుని వారు అక్కడ నుండి విజయవాడకు పిల్లలను తీసుకు వచ్చి సరోజినీ కి లక్ష నుండి రెండు లక్షల రూపాయలకు అమ్ముతారు. సరోజినీ పిల్లలు లేని వారిని/ సంతానలేమితో బాధపడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని వారికి నాలుగు నుండి ఐదు లక్షల రూపాయల వరకు బేరం కుదుర్చుకుని పిల్లలను అమ్ముతుంది.

ఈ క్రమంలో సరోజినీ అక్రమంగా పిల్లలను విక్రయించడానికి నగరంలో కొంతమందితో కలిసి ఒక ముఠా గా ఏర్పడి డిల్లీ మరియు ముంబాయిల నుండి తీసుకు వచ్చిన పిల్లలను విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇతరులకు అమ్మేది. సరోజినిపై గతంలో హైదరాబాదు మేడ్ పల్లి, గోపాలపురంలో మరియు విజయవాడ నున్న కేసులలో పిల్లలను అక్రమంగా విక్రయించిన కేసులలో అరెస్ట్ కాబడి జైలు కు వెళ్ళింది. ఈ సమయంలో పిల్లలు లేని వారి వివరాల ద్వారా వారిని మభ్య పెట్టి వారికి పిల్లలను అమ్మేది.

మరో నిందితురాలు గరికముక్కు విజయలక్ష్మి పై మంగళగిరి, ఏలూరు, కోదాడ, జనగాం మరియు సూర్యాపేట పోలీస్ స్టేషన్లలో మొత్తం 05 కేసులు కలవు. ఈమె ఈ కేసులలో జైలుకి వెళ్లి వచ్చినా కూడా తన పందా మార్చుకోకుండా పిల్లలను అక్రమంగా విక్రయించడంలో మధ్యవర్తిగా వ్యవహారిస్తుంది. ముక్తిపేట నందినీ పై హైదరాబాదు గోపాలపురం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు కలదు. ఫరీనా పై విజయవాడ నున్నలో ఒక కేసు కలదు. వీరందరూ ఒక ముఠా గా ఏర్పడి పిల్లలను అక్రమంగా విక్రయించడం చేస్తున్నారు.

సరోజినీ బైయిల్ పై విడుదలైన తరువాత కూడా తన ప్రవృత్తిని మార్చుకోకుండా అదే పందాను కొనసాగిస్తూ డిల్లీ కి చెందిన కిరణ్ శర్మ, భారతిల దగ్గర నుండి మరో ఇద్దరు పిల్లలను తీసుకుని వచ్చి ఒక పాపను భవానిపురంలోని బ్లేస్సి కు, మరో పాపను షేక్ ఫరీనా ద్వారా నున్న పోలీస్ స్టేషన్ పరిదిలో ఒక వ్యక్తికి అమ్మజూపింది. పైన తెలిపిన నిందితులు అందరూ డబ్బులకోసం సరోజినీ చెప్పిన మేరకు పిల్లలను ట్రాన్స్పోర్ట్ చేయడం మరియు పిల్లలను చూసుకోవడం చేస్తుంటారు.

ఇదే విధంగా సరోజినీ ముంబాయి కి చెందిన కవిత, నూరి మరియు సతీష్ అను వారి వద్ద నుండి ముగ్గురు పిల్లలను తీసుకుని వచ్చి ఒక పాపను సత్తెనపల్లి గ్రామానికి చెందిన షేక్ బాషావలి వద్ద అమ్మకానికి సిద్దంగా ఉంచింది. మరో బాబును నందినీ అమ్మకానికి సిద్దంగా ఉంచింది. వారిని కూడా రెస్కూ చేయడం జరిగింది. మరో పాపను యోహాన్ మరియు శ్రీను ల ద్వారా కొత్త పేట పోలీసు స్టేషన్ పరిదిలో అమ్మజూపింది.

వీరిపై భవానిపురం పి.ఎస్. నందు Cr.No 584/2025 U/s 143 BNS, 81,87 of JJ Act గా, నున్న పి.ఎస్. నందు Cr.No 506/2025 U/s 143 BNS, 81,87 of JJ Act గా మరియు కొత్తపేట పి.ఎస్.నందు Cr.No 489/2025 U/s 143 BNS, 81,87 of JJ Act గా కేసులు నమోదు చేయడం జరిగింది.

*పైన తెలిపిన నిందితులపై పి.డి యాక్ట్ కేసులను నమోదు చేసి వారిని జైలుకు పంపే విధంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.*

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ మరియు లా & ఆర్డర్ అధికారులను పోలీస్ కమిషనర్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ గారితోపాటు, డి.సి.పి.లు శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్. గారు, శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గారు, ఏ.డి.సి.పి.లు శ్రీ జి.రామకృష్ణ గారు, ఏ.సి.పి.లు. శ్రీమతి కె.లతాకుమారి గారు, శ్రీ ఎన్.వి.దుర్గా రావు గారు, శ్రీమతి స్రవంతి రాయ్ గారు, ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version