*ప్రచురణార్థం* *18-12-2025*
విజయవాడ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై ఎంపీ కేశినేని శివనాథ్ కృషి
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ పురందేశ్వరి భేటీ
గొల్లపూడి లోని బల్బ్ లైన్ల వద్ద శాటిలైట్ / హాల్ట్ రైల్వే స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన
కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వెంట నీటి నిల్వ సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
ఎంపీ కేశినేని శివనాథ్ అభ్యర్ధనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్
ఢిల్లీ :విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదల లక్ష్యంగా ఎంపీ కేశినేని శివనాథ్ అడుగులు వేస్తున్నారు. పార్లమెంట్ హౌస్ లో గురువారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఆయన కార్యాలయంలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ కలవటం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ని సత్కరించారు.
అనంతరం ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు–రైలు సమన్వయంతో కూడిన సమగ్ర రవాణా ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరం గురించి, జిల్లాలో పెరుగుతున్నరైల్వే రవాణా రద్దీ సమస్యల పరిష్కారానికి భవిష్యత్తు ప్రణాళిక పై , కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వెంట నీటి నిల్వ సమస్యల పరిష్కారం పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కూలంకుషంగా చర్చించారు.
ఈ సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఉన్న అధిక రద్దీని తగ్గించేందుకు గొల్లపూడి లోని బల్బ్ లైన్ల పరిధిలో శాటిలైట్ / హాల్ట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ ప్రాంతం రైల్వే అవసరాల కోసం భూసేకరణకు అనుకూలంగా ఉందని, ప్రధాన రహదారులు, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం, అలాగే రాబోయే అమరావతి న్యూ రైల్వే లైన్‌కు సమీపంలో ఉండటం వల్ల ఇది భవిష్యత్ రాజధాని అభివృద్ధికి కీలక కేంద్రంగా మారే అవకాశముందని వివరించారు. .
శాటిలైట్ రైల్వే స్టేషన్ ఏర్పాటుతో అమరావతి న్యూ రైల్వే లైన్, అవుటర్ రింగ్ రోడ్లు వంటి అభివృద్ధి మౌలిక వసతులకు మెరుగైన అనుసంధానం కలగడమే కాకుండా, ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఉన్న రద్దీ గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. ప్రజల సౌకర్యం, ప్రయాణికుల అవసరాలు, సరుకు రవాణా లాజిస్టిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖలతో కలిసి సంయుక్త తనిఖీ నిర్వహించి, ఫీజిబిలిటీ రిపోర్ట్‌తో పాటు వివరమైన ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని ఎంపీ కోరారు.
*కొండపల్లి పరిశ్రమ ప్రాంతానికి కీలకమైన రైలు మార్గం- ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థ అవసరం*
అదేవిధంగా, కొండపల్లి రైల్వే స్టేషన్ నుంచి విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ వరకు ఉన్న రైల్వే ట్రాక్ వెంట మురుగు నీరు, వర్షపు నీరు నిల్వ అవుతున్న సమస్యలను కూడా ఎంపీ కేశినేని శివనాథ్ కేంద్ర రైల్వే మంత్రికి వివరించారు. ఈ మార్గంలో నీటి నిల్వ కారణంగా రైల్వే భద్రత, నిర్వహణ సామర్థ్యం దెబ్బతింటోందని, మౌలిక వసతులు పదేపదే నష్టపోతున్నాయని తెలిపారు.
వర్షా కాలంలోనే కాకుండా సాధారణ వర్షపాతం సమయంలో కూడా శాస్త్రీయంగా రూపొందించిన డ్రైనేజ్ నెట్‌వర్క్, క్రాస్ డ్రైనేజ్ నిర్మాణాలు, కాలువల అనుసంధానం లేకపోవడం వల్ల ట్రాక్ వెంట నీరు నిల్వ ఉంటోందని తెలిపారు. దీని కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఎంబాంక్‌మెంట్ బలహీనపడటం, రైళ్లు నిదానంగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడి రైలు రాకపోకల్లో ఆలస్యం జరుగుతోందన్నారు. ఈ నీటి నిల్వల వల్ల స్థానిక నివాసితులు, పరిశ్రమలు, ముఖ్యంగా కృష్ణా మిల్క్ యూనియన్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
కొండపల్లి పరిశ్రమ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో సరుకు రవాణా జరిగే ఈ రైలు మార్గానికి చాలా కీలకమని పేర్కొంటూ, సమగ్ర నీటి నిర్వహణ, ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.. సంబంధిత జోనల్, డివిజనల్ రైల్వే అధికారులతో కలిసి సాంకేతిక పరిశీలన చేపట్టి, డ్రైనేజ్ కాలువలు, కల్వర్టులు, అవుట్‌ఫ్లో వ్యవస్థల నెట్‌వర్క్ రూపొందించాలని, అవసరమైన చోట్ల మున్సిపల్ , నీటిపారుదల శాఖలతో సమన్వయం చేసుకోవాలని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ని కోరారు. ఈ పనుల అమలుకు తగిన బడ్జెట్ కేటాయింపులు కూడా తక్షణమే చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే విజయవాడ నగరంలో రైల్వే రవాణా మరింత సవ్యంగా మారడంతో పాటు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, రైల్వే భద్రత, పరిశ్రమలు , స్థానిక ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని ఎంపీ కేశినేని శివనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదలనపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ఈకార్యక్రమంలో బిజెపి మైలవర్గం నియోజకవర్గ ఇన్చార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు, జనసేన మైలవరం ఇన్చార్జ్ అక్కల రామ్మోహనరావు (గాంధీ) లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
