పత్రికా ప్రకటన
ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 20, 2025
*వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం*
– *చిన్ననాటి నుంచే సామాజిక సమస్యలపై అవగాహన*
– *కెరీర్ పరంగా ఉన్నత లక్ష్యాల సాధన దిశగా నడిపించేందుకు ప్రోత్సాహం*
– *జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
బాల వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందుతుందని.. చిన్ననాటి నుంచే సామాజిక సమస్యలపై అవగాహన ఏర్పడి, వాటికి శాస్త్రీయ పరిష్కారాలకు సంబంధించిన ఆవిష్కరణలకు వీలవుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ.. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పి.ఈశ్వర్, విద్యాశాఖ అధికారులతో కలిసి గుణదలలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో జిల్లాస్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు.స్టెమ్ ఫర్ వికసిత్ అండ్ ఆత్మనిర్భర్ భారత్ ఇతివృత్తంతో పాటు సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, హరిత ఇంధనం, భవిష్యత్తు సాంకేతికతలు, గణిత వినోదం, ఆరోగ్యం, జల వనరుల నిర్వహణ, సంరక్షణ ఉప ఇతివృత్తాలతో నిర్వహించిన కార్యక్రమంలో 169 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు.
వ్యక్తిగత, బృంద, ఉపాధ్యాయ కేటగిరీల్లో నిర్వహించిన ప్రదర్శనలో గెలుపొందిన ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మక, సమస్య పరిష్కార ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. తరగతి గదిలో నేర్చుకున్న పరిజ్ఞానానికి ప్రాక్టికల్ నైపుణ్యాలు జోడించడం ద్వారా నవ ఆవిష్కరణలు వస్తాయన్నారు.
ప్రతి విద్యార్థికి ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి, వాటిని ప్రోత్సహించేందుకు వీలవుతుందన్నారు. కెరీర్‌లో ఉన్నతంగా ఎదిగేందుకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునేందుకు ప్రభుత్వం చేయూతనిస్తోందని.. ఇందుకు గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. నేడు మనం ఉపయోగిస్తున్న మొబైల్‌కు సంబంధించి ఏడు నోబెల్ ఆవిష్కరణలు ఉన్నాయంటే సైన్స్ శక్తి సామర్థ్యం ఏంటో తెలుస్తోందన్నారు. టీమ్ ఎన్‌టీఆర్ సమష్టి కృషితో విజ్ఞానంతో పాటు అన్ని రంగాల్లోనూ నెం.1గా నిలిచేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.
కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పి.ఈశ్వర్ మాట్లాడుతూ ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో భాగస్వాములైన ప్రతి విద్యార్థీ విజేతేనని, సమగ్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో డీఈవో ఎల్.చంద్రకళ, పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ వరప్రసాద్, హెచ్ఎం సిస్టర్ షైనీ థామస్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, జిల్లా సైన్స్ అధికారి కె.పిచ్చేశ్వరరావు, డీసీఈబీ సెక్రటరీ ఉమర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)




