ప్రచురణార్థం 18-12-2025
ఎన్.ఐ.ఆర్.డి లో బ్రిక్స్ తయారీ పై ఎస్.హెచ్.జి మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభం
ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న 4వ బ్యాచ్
విజయవాడ : ఎంపీ కేశినేని శివనాథ్ సారధ్యంలో కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో బ్రిక్స్ తయారీ పై మూడు రోజుల శిక్షణ పొందేందుకు హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డికి వెళ్లిన 35 మంది ఎస్.హెచ్.జి మహిళలకు శిక్షణ తరగతులు గురువారం ప్రారంభం అయ్యాయి. 4వ బ్యాచ్ గా వెళ్లిన వీరికి డిసెంబర్ 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు బ్రిక్స్ తయారీ పై శిక్షణ వుంటుంది.
వీరందరికి ముందుగా శిక్షణ తరగతుల గురించి అసోసియేట్ ఫ్రోపెసర్ (సి.ఐ.ఎ.టి.ఎస్.జె -హెడ్) డాక్టర్ సి.కత్తిరేషన్, అసోసియేషన్ ప్రోఫెసర్ డాక్టర్ ఎస్.రమేష్ శక్తివేల్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మహ్మాద్ ఖాన్ వివరించారు. అనంతరం బ్రిక్స్ తయారీ శిక్షణలో భాగంగా గృహ నిర్మాణ రంగంలో ఆధునిక, పర్యావరణ హిత సాంకేతికాలపై అవగాహన పెంపొందించేందుకు సుస్థిర , అనుకూల గృహ నిర్మాణ సాంకేతికతను పరిచయం చేశారు.
అలాగే CSEB (కంప్రెస్డ్ స్టెబిలైజ్డ్ ఎర్త్ బ్లాక్స్) తో పాటు ఇతర ఆధునిక గృహ నిర్మాణ పద్ధతులపై రూపొందించిన వీడియో డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అదేవిధంగా ఆర్.టి.పి లో ఏర్పాటు చేసిన సుస్థిర గృహ నిర్మాణ నమూనాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ నమూనాల ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యయ నియంత్రణ, శక్తి సమర్థత వంటి అంశాలపై శిక్షణ కు వచ్చిన ఎస్.హెచ్.జి మహిళలు ప్రాక్టికల్ అవగాహన పొందారు. ఈమేరకు ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.




