*పత్రికా ప్రకటన*
*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 19, 2025*
*పకడ్బందీ ఏర్పాట్లతో పల్స్ పోలియోను విజయవంతం చేయండి*
– *కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి*
– *ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
ఈ నెల 21వ తేదీ ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీ ఏర్పాట్లతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో 100 శాతం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 966 పోలియో బూత్‌ల పరిధిలో దాదాపు 2,48,900 మంది సున్నా నుంచి అయిదేళ్లలోపు పిల్లలు లక్ష్యంగా పల్స్ పోలియో నిర్వహించడం జరుగుతుందని..
వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్, ప్రజా రవాణా, ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులు కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. 611 గ్రామీణ బూత్‌లు, 355 అర్బన్ బూత్‌లు, 71 మొబైల్ బృందాలు, 35 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా ప్రత్యేక బృందాలు సేవలందిస్తాయన్నారు. ఈ నెల 21న బూత్ స్థాయిలోనూ.. ఈ నెల 22, 23వ తేదీల్లో ఇంటింటి సర్వే ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు.
ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా అధికారులు చూడాలన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంపై ఇప్పటి నుంచే వివిధ మార్గాల ద్వారా అవగాహన కల్పించాలని.. ముఖ్యంగా హైరిస్క్ ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు తదితర చోట్ల కూడా పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సూపర్వైజరీ అధికారులు కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతమయ్యేలా చూడాలని ఏ ఒక్కరూ మిగిలిపోకుండా ఇమ్యునజైషేన్ జరిగేలా చూడాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, డా. సునీల్, డా. జె.సుమన్ తదితరులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీర్ జిల్లా వారి ద్వారా జారీ)




