పోలియో రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం : జవ్వాది
*చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం*
*పెదవడ్లపూడి పిహెచ్సీలో పోలియో చుక్కలు కార్యక్రమం ప్రారంభం*
రాష్ట్రాన్ని పూర్తిగా పోలియో రహితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ తెలిపారు. ఆదివారం మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్సి) నందు నిర్వహించిన పోలియో చుక్కలు కార్యక్రమాన్ని మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా జవ్వాది మాట్లాడుతూ, పోలియో వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి చిన్నారులను రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి, రాష్ట్రాన్ని పూర్తిగా పోలియో రహితంగా మార్చేందుకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆరోగ్యమే మహాభాగ్యమని, చిన్న వయసులోనే నివారణ చర్యలు చేపట్టడం ద్వారా భవిష్యత్ తరాలను సురక్షితంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు.పోలియో నివారణ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేస్తేనే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాదల రమేష్ బాబు, బొర్రా శ్రీకాంత్… వైద్యాధికారులు, నర్సులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
