ప్రవేట్ పాఠశాలల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
ఈనెలాఖరులోగా ఆన్లైన్లో చేసుకోవాలన్న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు
రాష్ట్రంలో రానున్న 2026-27 విద్యా సంవత్సరంలో పాఠశాలలను ప్రారంభించేందుకు అనుమతి కోసం ఈనెల 31లోగా cse.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయ్ రామరాజు తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాల ప్రారంభానికి దరఖాస్తు చేసుకున్నవారికి నిబంధనలననుసరించి అనుమతి మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
అనుమతి ఇచ్చిన తర్వాత పాఠశాల ప్రారంభానికి కావాల్సిన సదుపాయాలు, గుర్తింపు తీసుకోవడానికి తగు సమయం అవసరమవుతుందని ఈ నేపథ్యంలో ఆసక్తిగలవారు ఈనెలాఖరులోగా ఆన్లైన్లో ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు. అనుమతి ప్రక్రియలో భాగంగా ఎంఈవో, డీఈవోలు పాఠశాలలను సందర్శించి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆ ప్రాంతంలో పాఠశాల అవసరం ఉందా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించి నివేదిక అంజేయాల్సి ఉంటుందన్నారు.
అంతేకాకుండా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారులు కూడా ఆయా ప్రాంతాల్లో పాఠశాల అవసరాల ప్రకారం నివేదిక సమర్పించాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.




