ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 21, 2025*
*రెండు చిన్న చుక్కలతో ఆరోగ్య భవిత*
– *పల్స్ పోలియో కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
రెండు చిన్న పోలియో చుక్కలు ఆరోగ్యకరమైన భవితకు బాటలు వేస్తాయని.. సుసంపన్న, ఆరోగ్య, ఆనందకర ఆంధ్రా లక్ష్యాల సాదనకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలుచేస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం నగరంలోని చుండూరు వెంకటరెడ్డి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల వద్ద పోలియో బూత్‌ను సందర్శించారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.
రోటరీ నగర్, హెచ్ బీ కాలనీ తదితర ప్రాంతాల్లో కూడా పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఆరోగ్య ఆంధ్ర సాకారానికి సమష్టి కృషి జరుగుతోందని.. పోలియోను అంతమొందించినప్పటికీ అప్రమత్తంగా ఉంటూ అయిదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతోందన్నారు.
తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయించాలని తెలిపారు. ఈ నెల 22, 23వ తేదీల్లో ఇంటింటి సర్వే ద్వారా కూడా మిగిలిపోయిన చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు.
వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్ తదితర శాఖల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతోందన్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్, ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు తదితర చోట్ల కూడా పాయింట్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతోపాటు డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, డీఐవో డా.శరత్‌బాబు, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి కూడా పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ విజయవంతానికి అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)






