రాజు కుమార్
మహబూబాబాద్ జిల్లా,డిసెంబర్ 20(భారత్ అవాజ్): కొత్తగూడ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాబోయే వార్షిక పరీక్షల నేపథ్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడ ఎస్ఐ రాజు కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందించారు….
ఈ సందర్భంగా ఎస్ఐ రాజు కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షల సమయంలో భయాందోళనలకు లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ రోజువారీ అధ్యయన ప్రణాళిక రూపొందించుకోవాలని, అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండాలని తెలిపారు. అలాగే చెడు అలవాట్లు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు*.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా ఉపాధ్యాయులను సంప్రదించాలని, క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం తప్పకుండా సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు…




