మహబూబాబాద్,డిసెంబర్ 22 (భారత్ అవాజ్):రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాదు నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు – కలెక్టర్లు.
ఈ. ఆర్. ఓ.లు, ఎ. ఈ. ఆర్. ఓ. లతో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దృష్ట్యా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, పట్టణ ప్రాంతాలలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ రోజుకి 10 వేల చొప్పున చేస్తూ నిర్దిష్ట గడులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వచ్చే వారంలోగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో వృద్ధి నమోదు కావాలని, మ్యాపింగ్ ప్రక్రియతో పాటు ఓటర్ల జాబితాలో బ్లర్ ఫోటోగ్రాఫ్/స్మాల్ ఫోటోగ్రాఫ్/ఇంప్రాపర్ ఫోటోగ్రాఫ్ ల గుర్తింపు చేపట్టాలని, ఫారం 8 ద్వారా అసలైన ఫోటోగ్రాఫ్ సేకరించి నవీకరించాలని, ఈ ప్రక్రియ జనవరి, 2026 లోగా పూర్తి చేయాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, బి.ఎల్.ఓ. ల వారీగా సమీక్ష నిర్వహించి పురోగతి సాధించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.అనిల్ కుమార్, రెవెన్యూ డివిజన్ అధికారి కృష్ణవేణి, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, అన్ని మండలాల తహసీల్దారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




