మహబూబాబాద్,డిసెంబర్ 22 (భారత్ అవాజ్): మహబూబాబాద్ మండలం లోని పలు గ్రామాలను జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు,అధికారుల బృందం సందర్శించి రైతులకు పూత దశలో మామిడి తోటలలో తీసుకోవలసిన సస్య రక్షణ చర్యలు మరియు ఆయిల్ పామ్ సాగు అంతర పంటల సాగు పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న , మొగ్గలను
ఉత్తేజపరచి తొందరగా పూత తెప్పించడానికి డిసెంబర్ 15-20ల మధ్య నీటి వసతి ఉన్న తోటల్లో పాదుల్లో తేలిక పాటి తడి ఇవ్వటం లేదా లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ 10 గ్రా, + యూరియా 5 గ్రా. చొప్పున కలిపి చెట్టుపై పిచికారి చేయడం వల్ల పూమొగ్గలు దాదాపు ఒకేసారి చిగురించి పూత త్వరగా వచ్చేలా చేయవచ్చునని అన్నారు. పచ్చిపూత దశలో అంటే పూత కాడలు బయటకు వచ్చే పూలు వికసించకుండా ఇంకా మొగ్గ దశలో ఉన్నప్పుడు.
లీటరు నీటికి 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ కలిపి పిచికారి చేయడం ద్వారా తేనె మంచు పురుగులను నివారించుకోవచ్చునని అన్నారు.పూత చుట్టు పురుగు పూతను గూడుగా ఏర్పరచుకొని, పూతను తిని విపరీతంగా నష్టపరుస్తుంది. ఇది ఆశించిన పూల గుత్తుల్లో పిందెలు ఏర్పడవు. ఈ పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పూల గుత్తుల పై పిచికారి వేయాలన్నారు. చల్లని రాత్రులు, వెచ్చని పగటి వాతావరణంలో పూకాడలపై, పూల మీద తెల్లని పొడి లాంటి (బూడిద తెగులు) బూజు ఏర్పడుతుంది. దీని నివారణకు పూమొగ్గలు కనిపించిన దశలో లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకం కలిపి పిచికారి చేయాలన్నారు.
పూత దశలో బూడిద తెగులు కనిపిస్తే లీటరు నీటికి హెక్సాకొనజోల్ 2 మి.లీ. లేదా ప్రొపికొనజోల్ 1 మి.లీ. లేదా డైనోకాప్ 1 మి.లీ. చొప్పున కలిపి పూత కాడలు తడిచేలా పిచికారి చేయాలన్నారు. పూత మాడు తెగులు నివారణకు మొగ్గ బయటకు వచ్చే దశలో 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్, పచ్చిపూత మీద 1 గ్రా. కార్బండాజిమ్ లేదా 1 గ్రా.
థయోఫినైట్ మిథైల్ ను లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలన్నారు. భారతీయ ఉద్యాన పరిశోధన స్థానం, బెంగుళూరు వారు రూపొందించన ఆర్కా మ్యాంగో స్పెషల్ ను పిచికారి చేయడం వలన పూత కాతా మంచిగా ఉంటుందని బృందం తెలిపిందన్నారు. మామిడి తోటలలో పూత సమయంలోనే కాకుండా వానాకాలం, యాసంగీ, వేసవి కాలాల్లో నెలవారీగా చేపట్టే యాజమాన్య పద్దతుల ప్రకారం, ఆధునిక పద్దతులను మామిడి రైతాంగం చేపట్టి నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలని తెలిపినారు.మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని,.
నిత్యం రోగనిరోధక శక్తికి, ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు అందించే పండ్ల తోటలు అయిన జామ, నిమ్మ, అరటి, బొప్పాయి, సీతాఫలం, పనస, నేరేడు, అవకాడో, ఫ్యాషన్ ఫ్రూట్, కూరగాయలు, ఆకు కూరలు, మునగ, వెదురు మొదలైనవి సాగు చేయాలని తద్వారా ఎకరానికి లక్ష రూపాయలు నికర ఆదాయం పొందాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా.
డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రో ట్రే లో నారు పెంపకం, ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆముదం పిండి వాడకం, వేప నూనె పిచికారి చేయటం, పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసిన ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సాగు, ట్రెల్లిస్ మెథడ్ లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి యం. విజయ నిర్మల, ఉద్యాన అధికారులు ఎ. జే. శాంతి ప్రియదర్శిని, డా. అడ్లూరి ప్రశాంత్, హెడ్ , శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధనా స్థానం, మల్యాల, రైతులు లక్కర్సు వెంకన్న, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.
