పేద ఇస్త్రీ వృత్తిదారులకు రోటరీ సాయం
20 మందికి ఉచిత ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెల పంపిణీ
రోటరీ డిస్ట్రిక్ట్–3150 గవర్నర్ ఎస్.వి. రామ్ ప్రసాద్ అధికారిక పర్యటనలో భాగంగా, మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పేద ఇస్త్రీ వృత్తిదారులకు ఉచితంగా ఎల్పీజీ ఆధారిత ఇస్త్రీ పెట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఆదివారం గణపతి నగర్లోని వీజే జూనియర్ కాలేజీ ఆవరణలో గవర్నర్ ఎస్.వి. రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా గవర్నర్ ఎస్.వి. రామ్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెల వినియోగంతో ఇస్త్రీ వృత్తి చేసుకునే వారికి నెలకు సుమారు రూ.2,000 వరకు ఇంధన వ్యయం ఆదా అవుతుందని తెలిపారు. బొగ్గు వినియోగం తగ్గడంతో బట్టలపై మసి అంటకుండా నాణ్యమైన సేవలు అందించగలుగుతారని, తద్వారా వారి వృత్తి నాణ్యత పెరిగి ఆదాయం మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెల వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం నియంత్రణకు కూడా దోహదం చేస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూర్వ జిల్లా గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్, అసిస్టెంట్ గవర్నర్ పూర్ణచందు పాల్గొన్నారు. మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రేగడ రాజశేఖర్ మాట్లాడుతూ, 20 మంది పేద ఇస్త్రీ వృత్తిదారుల కుటుంబాలకు సుమారు రూ.2 లక్షల వ్యయంతో పర్యావరణ హితమైన ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెలను అందజేశామని తెలిపారు.
వీటిలో వేడి నియంత్రణ సౌకర్యం ఉండటంతో ఇంధన ఆదా జరుగుతుందని, బొగ్గు వాడకం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు నివారించవచ్చని చెప్పారు.ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి పరేపల్లి నిరంజన్ గుప్తా, సేవా ప్రాజెక్ట్ డైరెక్టర్ చనుమొలు గోపాల్,ఛార్టర్డ్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి,గాజుల శ్రీనివాస్, అందే మురళి, కాపురోతు సుందరయ్యతో పాటు ఇతర రోటరీ ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




