AP Weavers Get Machines At 90% Subsidy: చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త. అర్హులైన వారికి ఆధునిక పరికరాలపై 90% రాయితీతో పాటు, షెడ్ల నిర్మాణానికి 100% ఉచిత సహాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ‘జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం’ కింద ఈ పథకం అమలు చేయబడుతోంది. దీనితో చేనేత కార్మికులు మెరుగైన వస్త్రాలను నేసి, ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేతల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికుల ఆదాయాన్ని పెంచడంతో పాటుగా సులభతరం చేయడానికి ‘జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డీపీ)’ కింద, చేనేత కార్మికులకు ఆధునిక పరికరాలను అందిస్తున్నారు. ఏకంగా 90 శాతం రాయితీ అందిస్తున్నారు.. పరికరాల ధరలో 90 శాతాన్ని కేంద్రమే భరిస్తుంది. మిగిలిన 10 శాతాన్ని మాత్రమే కార్మికులు తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ రాయితీ పథకం, కేంద్రం ప్రకటించిన క్లస్టర్లలోని కార్మికులకు మాత్రమే కాకుండా, వ్యక్తిగతంగా చేనేత వృత్తిని జీవనోపాధిగా చేసుకున్న వారికి కూడా వర్తిస్తుంది. ఆధునిక పరికరాల సహాయంతో కొత్త డిజైన్లతో కార్మికులు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉండే వస్త్రాలను నేయగలుగుతారని చెబుతున్నారు. వారి ఉత్పత్తుల నాణ్యతను పెంచి, మార్కెట్లో మంచి ధరను పొందడానికి ఉపయోగంగా ఉంటుంది.
చేనేత కార్మికులకు ఈ ఆధునిక చేనేత పరికరాలను ఎన్‌హెచ్‌డీపీ (National Handloom Development Programme) పథకం కింద కేంద్రం అందిస్తోంది. ఈ పథకం ద్వారా 26 రకాల ఆధునిక పరికరాలను చేనేత కార్మికులకు అందుబాటులోకి తెస్తున్నారు. రాయితీపై లభించే పరికరాలలో మోటరైజ్డ్ జకార్డ్ మిషన్లు, ఫ్రేమ్ మగ్గాలు, 120/140 జకార్డ్ మిషన్లు, అచ్చుసెట్లు, నూలు చుట్టే యంత్రాలు వంటివి ఉన్నాయి. ఈ పరికరాల ధరలు రూ.3,500 నుంచి రూ.లక్ష వరకు ఉంటాయి.. వీటిని రాయితీపై అందిస్తున్నారు. ఉదాహరణకు ఏదైనా పరికరం ధర రూ.లక్ష ఉంటే.. అందులో 10శాతం అంటే రూ.10వేలు కడితే సరిపోతుంది. చేనేత కార్మికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
ఈ పథకం కింద పరికరాలు పొందాలనుకునే అర్హత కలిగిన చేనేత కార్మికులు తమ జిల్లాలోని ఏడీ (Assistant Director) కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు ఆధార్‌కార్డు, చేనేత కార్మికులకు ఇచ్చే గుర్తింపు కార్డు (చేనేత కార్డు), రేషన్ కార్డు, మరియు ఇటీవలి ఫోటోలను తప్పనిసరిగా సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన ఇద్దరు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుంది. ఈ పరిశీలనలో కార్మికుల అర్హతను నిర్ధారిస్తారు. అర్హత నిర్ధారణ తర్వాత, ఈ బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుంది. ఈ నివేదిక ఆధారంగానే పరికరాల మంజూరు ప్రక్రియ ఉంటుంది.
కేంద్రం ప్రతి ఏటా రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా ఆధునిక పరికరాలను మంజూరు చేస్తుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్‌కు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 10 ప్రాజెక్టులు వచ్చాయి. ప్రతి ప్రాజెక్టు విలువ 30 లక్షల రూపాయలు. అంటే, రాష్ట్రానికి ఏడాదికి దాదాపు 3 కోట్ల రూపాయల వరకు నిధులు అందుతాయి. ఈ పథకం కింద ఎంతమందికి సహాయం అందుతుందనేది వారు ఎంచుకునే పరికరాల ధరపై ఆధారపడి ఉంటుంది. తక్కువ ధర ఉన్న పరికరాలను ఎంచుకుంటే, ఎక్కువ మంది లబ్ధి పొందుతారు. ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా, ప్రతి సంవత్సరం సుమారు 900 మందికి సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రాష్ట్రానికి కేటాయించిన లక్ష్యం కంటే ఎక్కువ మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం వారికి కూడా సహాయం మంజూరు చేసింది.
ఫ్రేమ్ మగ్గంతో గుంత మగ్గాలతో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయి. మోటరైజ్డ్ జకార్డ్ మగ్గంతో కాళ్లతో నొక్కాల్సిన పని తప్పుతుంది.. శ్రమ తగ్గుతుంది. 120 జకార్డ్ మిషన్‌తో మంచి డిజైన్లతో పాటుగా చీరకు మంచి డిజైన్లను వేయొచ్చు.. మంచి ధర వస్తుంది. అంతేకాదు చేనేతలకు స్థలం ఉంటే కనుక వారు షెడ్ ఏర్పాటు చేసుకుంటే.. 100శాతం రాయితీ కల్పిస్తారు. రూ.70వేల నుంచి రూ.1.20 లక్షలు ఉచితంగా కూడా ఇస్తారు. అలాగే వారికి రూ.15వేల లైటింగ్ సెట్ కూడా ఇస్తారు. చేనేత కార్మికులు ఈ అవకాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
