హైదరాబాద్ : మహిళా సర్పంచ్‌లున్న గ్రామాల్లో ఇంకా పతి సంస్కృతి కొనసాగుతుందా?
ఈసారి నుంచైనా పతి పంథా మారుతుందా?
అధికారం మహిళా నేతల చేతుల్లోనే ఉంటుందా?
మళ్లీ.. ఊళ్లలో పరోక్షంగా భర్తలే అన్నీ తామై వ్యవహరిస్తారా?
నూతన మహిళా సర్పంచ్ లు ప్రమాణస్వీకారాలు చేయడంతో గ్రామాల్లో కొత్త చర్చ.
గ్రామ పంచాయతీల్లో మహిళా రిజర్వేషన్ల వల్ల మహిళలు సర్పంచ్‌లుగా గెలుస్తున్నా, క్షేత్రస్థాయిలో వారి భర్తల ఆధిపత్యం కొనసాగడం ఓ సామాజిక సవాల్‌గా మారింది. ఇకనైనా ఈ పరిస్థితి మారుతుందా? లేదా?
ప్రభుత్వాలు ఇప్పుడు సర్పంచ్ పతి సంస్కృతిపై సీరియస్‌గా ఉన్నాయి. అధికారిక సమావేశాలకు వారికి బదులుగా భర్తలు హాజరైతే.. వారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.
అయితే.. ఎంతమంది భర్తలు ఈ నిబంధనలను పాటిస్తారనేదే పెద్ద ప్రశ్న.
చెక్ పవర్ మహిళా సర్పంచ్‌లకే ఉంటుంది. సంతకం పెట్టే అధికారం వారిదే కాబట్టి, పరిపాలనపై నియంత్రణ వారిదే ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది.
ఎందుకంటే.. మహిళలు సర్పంచ్‌లుగా గెలిచిన గ్రామాల్లో.. వారి భర్తలే తామే అన్నీ ముందుండి నడిపించాలని చూస్తుంటారు.
ఎన్నికల ఖర్చు అంతా భర్తలే భరించడం వల్ల, గెలిచిన తర్వాత అధికారం తమదే అన్న ధీమా వారిలో ఉంటోంది. కానీ.. అధికారికంగా, ప్రజలు ఎన్నుకున్నది మహిళలనే. కాబట్టి.. అధికారం కూడా వారి దగ్గరే ఉండాలనే డిమాండ్ వినిపిస్తోంది.
పోలీస్ స్టేషన్లు, మండల ఆఫీసుల చుట్టూ తిరగడం మహిళలకు ఇబ్బందిగా ఉంటుందనే నెపంతో భర్తలు ఆ బాధ్యతలను తీసుకుంటున్నారు. దీనివల్ల తెలియకుండానే పవర్ భర్తల చేతుల్లోకి వెళ్తోంది. కానీ.. ఈ కార్యకలాపాల్లో వారిని కూడా భాగస్వామ్యం చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రజలు కూడా సర్పంచ్‌ను కాకుండా ఆమె భర్తను సంప్రదిస్తే.. ఈ పతి సంస్కృతి ఇలాగే కొనసాగుతుంది. అందువల్ల పరిస్థితుల్లో మార్పు రావాలి. భర్తలు సహాయకులుగా ఉండి, నిర్ణయాధికారం మహిళలకే వదిలేసినప్పుడే.. అసలైన మహిళా సాధికారత సాధ్యమవుతుంది.
sidhumaroju✍️




