*నరేగా పథకంలో కేంద్రం వాటా తగ్గింపు సమంజసం కాదు*
*సీఎం చంద్రబాబుకు సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతిపత్రం*
*అమరావతి, డిసెంబర్ 22 :* జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం సమంజసం కాదని, దీనిపై కేంద్రంతో మాట్లాడి మహాత్మాగాంధీ పేరును కొనసాగించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు.
సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావుతో పాటు రామకృష్ణ సీఎంను కలిశారు.
ఈ సందర్భంగా పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఎమ్‌జీఎన్‌ఆర్ఈజీఎస్ పథకానికి ఇచ్చే 90 శాతం నిధులను 60 శాతానికి కేంద్రం కుదించిందని, 40 శాతం నిధులను రాష్ట్రం భరించాలంటే ఏపీ సహా పలు రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందని సీఎంతో అన్నారు.
అదే విధంగా 100 నుంచి 125 రోజులకు పనిదినాలు పెంచుతామని కేంద్రం చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు కుటుంబానికి సగటున 50 పని దినాలు కూడా కల్పించలేదని తెలిపారు. ఇప్పటి వరకూ హక్కుగా ఉన్న ఈ చట్టంలో సవరణల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కష్టంగా మారుతుందని, వెంటనే సవరణలను వెనక్కి తీసుకునేలా కేంద్రంతో మాట్లాడాలని కోరారు.




