*జారిపడుతోన్న బండరాళ్లు*
*-ప్రమాద భరితంగా పానకాల స్వామి ఘాట్ రోడ్డు మార్గం*
*పట్టీపట్టనట్లుగా దేవాదాయశాఖ అధికారులు*
*రిటైనింగ్ వాల్ నిర్మించాలని భక్తుల వినతి*
*మంగళగిరి:*
మంగళగిరి కొండపై వేంచేసియున్న శ్రీ పానకాల లక్ష్మీ నృసింహ స్వామి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డు మార్గంలో తరచూ బండరాళ్లు జారిపడుతోన్నాయి. దీంతో ఘాట్ రోడ్డు మార్గంలో రాకపోకలు సాగించే భక్తులు, వాహనదారులు బండరాళ్లు ఎక్కడ తమపై పడిపోతాయోనని భయాందోళనకు గురి అవుతున్నారు. ఘాట్ రోడ్డు నిర్వహణా లోపంతో ప్రమాద భరితంగా తయారవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘాట్ రోడ్డు వెంబడి కొండకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే తమ ప్రాణాలను కాపాడిన వారవుతారని భక్తులు అంటున్నారు.
*ఎగువ సన్నిధిలో కార్లు పార్కింగ్ వద్ద అపరిశుభ్రత*
*నిలిచిన మురుగునీటి తో దుర్వాసన*
కొండపై కార్లు పార్కింగ్ చేసే ప్రాంతంలో మురుగునీరు నిలిచి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. నిలిచిన మురుగునీరు పచ్చగా మారడంతో పాటు దోమలు పెరిగి వ్యాప్తి చెందుతోన్నాయి. దీంతో ఎగువ సన్నిధికి వచ్చే భక్తులు కొంత అసహనానికి గురి అవుతోన్నారు. ఎంతో పవిత్రమైన ఆలయం శ్రీ పానకాల లక్ష్మీ నృసింహ స్వామి ఆవరణలో ఇలాంటి అపరిశుభ్రమైన దృశ్యాలు కనిపించడం బాధాకరమని, అధికారులు స్పందించి శుభ్రతా చర్యలు చేపట్టాలని పలువురు భక్తులు కోరుతున్నారు.
*కంపు కొడుతోన్న మరుగుదొడ్లు…ఆపై అక్రమంగా రుసుం వసూళ్లు*
మంగళగిరి కొండపై కొలువైన శ్రీ పానకాల లక్ష్మీ నృసింహ స్వామి ఆలయానికి సంబంధించిన మరుగుదొడ్లు అపరిశుభ్రతకు నిలయంగా మారాయి. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు మరుగుదొడ్లు వినియోగించుకోవాలంటే రుసుం చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. మల,మూత్ర విసర్జన చేసే భక్తుల వద్ద నుంచి రూ.5 నుంచి రూ. 10 వరకూ అక్రమంగా వసూలు చేస్తోన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వెటకారపు మాటలతో చీదరించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఎగువ సన్నిధిలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






