*ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 23, 2025*
*సినీ, సాహిత్య, సాంస్కృతిక ఆవకాయ్*
– *జనవరి 8 నుంచి పది వరకు ఘనంగా అమరావతోత్సవాలు*
– *రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిలో మరో కీలక అడుగు*
– *మన సాంస్కృతిక వైభవానికి అంతర్జాతీయ గుర్తింపునకు వీలు*
– *ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
విజయవాడ మరో ఉత్సవ హేళకు వేదిక కానుందని.. జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆవకాయ్ పేరుతో సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవం జరగనుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
మంగళవారం విజయవాడలో కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ.. ఏపీటీఏ డిప్యూటీ సీఈవో ఎ.శ్రీనివాస్, టీమ్‌వర్క్ (సెలబ్రేటింగ్ ది ఆర్ట్స్) సంస్థ ప్రతినిధి సయ్యద్ శామ్స్ తదితరులతో కలిసి ఆవకాయ్ అమరావతోత్సవం వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.
అమరావతిని సాంస్కృతిక సాహితీ రాజధానిగా తీర్చిదిద్దేందుకు గౌరవ ముఖ్యమంత్రి దిశానిర్దేశానికి అనుగుణంగా ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ పున్నమి ఘాట్, భవానీ ఐల్యాండ్‌లో నిర్వహించే ఉత్సవాలకు ప్రవేశం ఉచితమని.. గౌరవ ముఖ్యమంత్రి ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారన్నారు. సినిమా, సంగీతం, సాహిత్యం, సాంస్కృతిక వైభవాన్ని ఒకేవేదికపైకి తెచ్చే గొప్ప ఉత్సవాలు ఇవని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వ సంపదకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అమరావతిని సాహితీ, కళల రాజధానిగా మార్చేందుకు తొలిమెట్టుగా ఈ ఫెస్టివల్ ఉండనుందన్నారు. మూడు రోజుల పాటు జరగనున్న వేడుకల్లో భాగంగా తెలుగు సినిమా మూలాలు, సాహిత్య నేపథ్యం, నేటి మార్పులపై చర్చలు, ప్రదర్శనలు కూడా ఉంటాయన్నారు.
సంగీత ప్రదర్శనలు, హెర్ ఫ్రేమ్స్, హెర్ ఫైర్ ప్రదర్శనలు, ది మ్యూజిక్, మస్తీ, మ్యాజిక్, టైమ్ లెస్ టేల్స్ , ముషాయిరా ఎక్స్‌పీరియన్స్ వంటి కార్యక్రమాలుంటాయన్నారు. స్థానిక కళాకారులను కూడా ఈ ఉత్సవాల ద్వారా ప్రోత్సహించనున్నట్లు వివరించారు. వారసత్వ యాత్రలు, ఘాట్ ఫెర్రీ ప్రయాణాలు, రుచికరమైన స్థానిక వంటకాలతో కూడిన ఫుడ్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. మీడియా సమావేశానికి ముందు కలెక్టర్ లక్ష్మీశ.
వివిధ శాఖల అధికారులతో ఆవకాయ్ ఉత్సవాలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ, పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్యం తదితర శాఖల అధికారులకు ఉత్సవాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. విజయవాడ ఉత్సవాలను విజయవంతం చేసినట్లే ఆవకాయ్ సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవాన్ని కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇది తొలి అడుగు మాత్రమేనని.
. ఏటా ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఏపీటీఏ డిప్యూటీ సీఈవో ఎ.శ్రీనివాస్ తెలిపారు. టీమ్‌వర్క్ సంస్థకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాంస్కృతిక, సాహిత్య ఉత్సవాలను నిర్వహించి, విజయవంతం చేసిన గుర్తింపు ఉందన్నారు. కలెక్టర్ లక్ష్మీశ.. ఏపీటీఏ అధికారులు, టీమ్‌వర్క్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)




