కర్నూలు : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ శ్మశాన భూమి కబ్జా – సీఐడీ విచారణ కోరుతూ ఫిర్యాదుఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వానికి చెందిన శ్మశాన భూమిని అక్రమంగా కబ్జా చేసి, నకిలీ రిజిస్ట్రేషన్లు చేసి, బ్యాంకు రుణాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బుట్టా ఫౌండేషన్ సేవ సంస్థ ప్రతినిధి శ్రీ బుట్టా నీలకంఠ తెలిపారు.
వివరాల్లోకి వెళితే, ఎమ్మిగనూరు పట్టణంలోని సర్వే నెంబర్లు 171A, 171Bలలో ఉన్న సుమారు 2.87 ఎకరాల ప్రభుత్వ భూమిని 1960 సంవత్సరానికి ముందే అప్పటి పంచాయతీ బోర్డు ద్వారా వివిధ కులాలకు చెందిన ప్రజల శ్మశాన వాటికగా కేటాయించినట్లు ఆయన తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ భూమిలో అంత్యక్రియలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.అయితే, ఆ భూమిపై ఎలాంటి హక్కులు లేని కొందరు వ్యక్తులు రాజకీయ పలుకుబడి ఉపయోగించి రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్ మరియు బ్యాంకు అధికారులను ప్రభావితం చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ప్రభుత్వ శ్మశాన భూమిని తమ పేర్లపై రిజిస్టర్ చేసుకున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా, ఆ భూమిని బ్యాంకులో తనఖా పెట్టి లక్షల రూపాయల రుణాలు తీసుకోవడంతో పాటు, శ్మశానంలోకి వెళ్లే మార్గాలను మూసివేసి, అనుమతులు లేకుండా రోడ్లు, ప్లాట్లు వేసి అమ్మకాలు జరుపుతున్నారని తెలిపారు.ఈ అక్రమ వ్యవహారంలో భూ కబ్జాదారులతో పాటు సంబంధిత రెవెన్యూ, మున్సిపల్, సబ్-రిజిస్ట్రార్ మరియు బ్యాంకు అధికారులు కూడా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.
ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ శ్మశాన భూమిని కాపాడడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐడీ, డీజీపీ, జిల్లా కలెక్టర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బుట్టా నీలకంఠ వెల్లడించారు.ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
