కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం రంగం పట్ల అశ్రద్ధ చూపుతూ ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూరుస్తున్నాయని మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ వ్యవసాయ శాఖా మాత్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. ఈనెల 23వ తేదీన మాజీ ప్రధాని, భారతరత్న చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతాంగం సమస్యలు – పరిష్కారాలపై జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ రైతు ఉద్యమ నేత .
మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు తో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించింది. వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రసంగిస్తూ చౌదరి చరణ్ సింగ్ దేశ 5వ ప్రధానిగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవసాయరంగ అభివృద్ధికి అవిరళ కృషి జరిపినారని అన్నారు. భూ సంస్కరణలు అమలు చేయడం, జమీందారీ విధానాన్ని రద్దు చేయడం, కౌలు దారులకు రక్షణ కల్పించే చట్టమును అమలు చేయడం లాంటి సంస్కరణలతో వ్యవసాయ రంగంలో పెను మార్పులు చేశారని గుర్తు చేశారు.
నేడు లక్షలాది ఎకరాల పంట భూములను బడా కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారని, 16 లక్షల కోట్ల బడా కంపెనీల ఋణాలను రద్దు చేశారని, మరోవైపు బిజెపి పాలనలో గత 11 సంవత్సరాలుగా అప్పుల ఊబిలో కొనసాగుతున్న రైతుల ఋణాలను రద్దు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయడం లేదన్నారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అల్పంగా ఉందని, వ్యవసాయ పరిశోధనలకు తగిన బడ్జెట్ కేటాయించడం లేదన్నారు.
రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం వలన ప్రతిఏటా మూడు లక్షల కోట్ల రూపాయలను రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అదనంగా లభించేటట్లు వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నిర్ణయించాలని నివేదిక అందిస్తే మోడీ ప్రభుత్వం ఎం ఎస్ స్వామినాథన్ నివేదికను అమలు చేస్తామని పేర్కొని ఆచరణలో అమలు చేయటం లేదన్నారు.
చైనా రైతంగానికి ప్రతి ఏటా 15 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ అందిస్తుందని అందులో 10 శాతం కూడా భారత ప్రభుత్వం రైతాంగానికి అందించడం లేదన్నారు. గత 11 సంవత్సరాలల్లో దేశవ్యాప్తంగా లక్ష 50 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ భారతదేశ జనాభాలో 46 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తూ దేశ జాతీయ ఆదాయంలో కేవలం 15 శాతం మాత్రమే పొందుతున్నారన్నారు.
అమెరికా జనాభాలో 1.3 శాతం మాత్రమే ప్రజలు వ్యవసాయ రంగంపై జీవిస్తున్నారని ఆ దేశ జాతీయ ఆదాయంలో ఒక్క శాతం పొందుతున్నారని అన్నారు. భారత దేశ వ్యవసాయ భూమిలో సగం భూమికి నీటిపారుదల సౌకర్యాలు లేవని తద్వారా వ్యవసాయ రంగ ఉత్పాదకత చాలా అల్పంగా ఉందన్నారు.
రైతాంగంలో 80 శాతం మంది 2 ఎకరాల లోపు వారై ఉండటం వలన వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ సక్రమంగా జరగటం లేదన్నారు. సగటు కమతాల పరిమాణం ఆస్ట్రేలియాలో 3 వేల 200 హెక్టార్లు, అమెరికాలో 180 హెక్టార్లు, బ్రెజిల్, ఫ్రాన్స్ లలో 70 హెక్టార్లు ఉండగా, ఇండియాలో కేవలం 0.7 హెక్టార్లు మాత్రమే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో గత రెండు సంవత్సరాల కాలంగా మామిడి, టమాట, ఉల్లి, శనగలు, పత్తి, మిర్చి లాంటి పంటలకు గిట్టుబాటు ధర లేక అతివృష్టి, అనావృష్టి, అకాలవృష్టి గురవుతున్నారని వివరించారు.
ఆచార్య ఎన్. జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాల్ ప్రసంగిస్తూ చైనాలో ప్రతి రైతుకు కనీస భూమి లభించడం వలన ఆధునిక యంత్రాలను, మేలు రకం విత్తనాలు, ఎరువులు చైనా ప్రభుత్వం అందించడంతో చైనా వ్యవసాయ రంగంలో ఉత్పాదకత గణనీయంగా పెరిగి ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి, పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందని ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగైనవని పేర్కొన్నారు.
మనదేశంలో వ్యవసాయ రంగంలో పరిశోధనలకు సరైన ప్రోత్సాహకాలు, నిధులు ఇవ్వడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి, మానవత కార్యదర్శి కె.సతీష్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నేత సిహెచ్ పరమేశ్వర రెడ్డి, రైతు సంఘ నాయకులు కొల్లి రంగారెడ్డి, కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు పఠాన్ అల్లా బక్షు, జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.






