Home South Zone Andhra Pradesh వాజ్‌పేయి విగ్రహావిష్కరణ ర్యాలీ |

వాజ్‌పేయి విగ్రహావిష్కరణ ర్యాలీ |

0

భారత మాజీ ప్రధాని, అజాత శత్రువుగా దేశ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిన అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఆయన కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గుంటూరు లాడ్జి సెంటర్ నుండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివెళ్లారు.

తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావులు ఎన్డీయే కూటమి నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అమరావతికి బయలుదేరిన బస్సులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి ప్రారంభించారు.

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మీడియాతో మాట్లాడుతూ….*
అమరావతిలో ఈ రోజు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా అటల్ బిహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. రాజధాని అమరావతిలో అటువంటి మహానేత విగ్రహాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్రానికి, అమరావతి భవిష్యత్తుకు గర్వకారణమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతిని ఘనంగా జరుపుకుంటున్న ఈ శుభ తరుణంలో, అలాంటి మహానేతకు నివాళులు అర్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందన్నారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి కేవలం ఒక వ్యక్తి కాదని, దేశానికి “గుడ్ గవర్నెన్స్” అనే భావనను అందించిన గొప్ప దార్శనిక నాయకుడని పేర్కొన్నారు.
గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్టు, గ్రామీణాభివృద్ధి పథకాలు, విద్యా రంగానికి ఆయన అందించిన ప్రోత్సాహం, దేశ భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలు – కార్గిల్ యుద్ధం, పోక్రాన్ అణు పరీక్షలు వంటి చారిత్రాత్మక ఘట్టాలు వాజ్‌పేయి పాలనలోనే సాధ్యమయ్యాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుర్తు చేశారు. దేశ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో పెంచిన నాయకుడిగా.

అదే సమయంలో సౌభ్రాతృత్వం, పొరుగుదేశాలతో సత్సంబంధాలను కాపాడిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచారని అన్నారు.
అటల్ అనే పేరు అర్థమే అచంచలమైనది, విభజించలేనిదని, ప్రధానిగా మాత్రమే కాకుండా సామాజిక సంస్కర్తగా, రచయితగా, భారతరత్నగా భారతదేశానికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివని తెలిపారు. ఈ గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నేతలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.

NO COMMENTS

Exit mobile version