నగర పాలక సంస్థ, గుంటూరు
గుంటూరు నగరంలో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ కి ఆటంకం కల్గిస్తూ, ప్రమాదాలకు కారణంగా ఉంటున్నఆవులను, ఎద్దులను 3 బృందాల ద్వారా గోశాలకు తరలించడం జరుగుతుందని, తరలించిన వాటిని ఎట్టి పరిస్తితుల్లో తిరిగి ఇవ్వబడవని, తరలింపుని అడ్డుకుంటే పోలీసు కేసులు నమోదు చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. బుధవారం ఎల్ఆర్ కాలనీ, ఏటుకూరు రోడ్ ప్రాంతాల్లో రోడ్ల మీద ఉన్న ఆవులను గోశాలకు తరలింపులో కమిషనర్ నేరుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్ల మీద ఆవులు విచ్చలవిడిగా వదులుతున్నారని, దాని వలన రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పలుమార్లు ఆవుల యజమానులకు రోడ్ల మీదకు వదలవద్దని తెలిపినా నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు. ముద్రలు ఉన్న, పెంపుడు ఆవులైనా రోడ్ మీదకు వస్తే జిఎంసి గోశాలకు తరలిస్తామన్నారు. తరలించిన ఆవులను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు.
ఆవులను పట్టుకోవడానికి 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, బృందాలలో పోలీసులు కూడా ఉంటారన్నారు. ఆవులను పట్టుకోవడంను వీడియో రికార్డింగ్ చేస్తామని, ఎవరైనా అడ్డుకుంటే చట్టపరంగా కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిఎంసి గోశాలలో కూడా అదనపు సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, సిబ్బందిని షిఫ్ట్ ల వారీగా పెంచాలని ఎంహెచ్ఓని ఆదేశించారు.
గోశాలని ప్రజారోగ్య అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, తాము కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తామని తెలిపారు. పర్యటనలో డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్ఎస్ అయూబ్ ఖాన్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.




