Mukkoti Ekadasi 2025 ధనుర్మాసం (Dhanurmasam 2025) వేళ ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేసే పర్వదినం ఈ ముక్కోటి ఏకాదశి. శ్రీమహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచి చూసే పవిత్రదినం. ముఖ్యంగా ఉత్తర ద్వారం నుంచి ఆ పురుషోత్తముణ్ని దర్శించుకునే పుణ్యదినం. సంవత్సరానికి 12 నెలలు. నెలకు రెండు ఏకాదశులు అంటే మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. కానీ వేటి విశిష్టత వాటిదే! కానీ ఈ 24 ఏకాదశుల్లో అత్యంత ప్రత్యేకమైనది, విశిష్టమైనది మాత్రం ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadasi). దీనినే వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi 2025) అని కూడా పిలుస్తారు.
Mukkoti Ekadasi 2025
ముక్కోటి ఏకాదశి.
ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువును స్తుతించి.. ఆయన అనుగ్రహం పొందిన రోజు కావడంతో దీనికి ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadasi) అనే పేరు వచ్చిందని శాస్త్రవచనం. సాధారణంగా ఏకాదశి (Ekadasi) పర్వదినాన్ని చాంద్రమానం ఆధారంగా జరుపుకుంటారు. కానీ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిని మాత్రం సౌరమానం ఆధారంగా జరపుకోవడం విశేషం.
సూర్యభగవానుడు ధనుస్సు రాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవడం సంప్రదాయం. సాధారణంగా దేవతలకు ఉత్తరాయణం పగటి సమయంగానూ.. దక్షిణాయనం రాత్రి సమయంగా పేర్కొంటారు. అయితే ఉత్తరాయణం – దక్షిణాయనాలకు సంధి కాలంలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయంగా పండితులు అభివర్ణిస్తారు. అదే సమయంలో అంటే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అదే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadasi 2025).
ఈ ఏకాదశి (Ekadashi) రోజు దేవతలంతా వైకుంఠానికి వెళ్లి ఉత్తర ద్వారం నుంచి ఆ వైకుంఠనాథుడిని దర్శనం చేసుకుంటారట. అదే సంప్రదాయం ప్రకారం శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడం కోసం వైష్ణవ ఆలయాల్లో.. వైకుంఠంతో సమానమైన రత్న మందిరాన్ని నిర్మించి.. ఉత్తర దిక్కుగా స్వామి వారిని దర్శించి తరిస్తారు. దీనిని ఉత్తర ద్వార దర్శనం అంటారు. ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వేచి ఉంటారు. మోక్ష ద్వారంగా చెప్పే ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకుంటే చాలు తమ జన్మ పునీతమవుతుందని భావిస్తారు.




