పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడదాం:
పౌరహక్కుల సంఘం పిలుపు
విజయవాడ,డిసెంబర్ 27
రాజ్యాంగానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి, పౌర హక్కుల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పౌరహక్కుల సంఘం (సిఎల్సీ) పిలుపునిచ్చింది. శనివారం విజయవాడలోని ప్రెస్ క్లబ్‌లో పౌరహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ 20వ రాష్ట్ర మహాసభల పోస్టర్, కరపత్రాన్ని సంఘం ప్రతినిధులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కోశాధికారి పి. రాజారావు రాష్ట్ర సహాయ కార్యదర్శి టి. ఆంజనేయులు మాట్లాడుతూ, వచ్చే నెల జనవరి 10, 11 తేదీల్లో తిరుపతి నగరంలో ఈ 20వ రాష్ట్ర మహాసభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ‘రాజ్యాంగం-నిర్బంధం’ అనే ప్రధాన అంశంపై ఈ సభలు జరుగుతాయని, పౌరహక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఈ మహాసభలు సాగుతాయని వారు పేర్కొన్నారు.
మహాసభలను సీనియర్ జర్నలిస్ట్ మరియు అమరవీరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షులు రాఘవశర్మ ప్రారంభిస్తారని అన్నారు.మొదటి రోజు జస్టిస్ చంద్రకుమార్, హేమలత కుమార్, ప్రొఫెసర్ హరగోపాల్ వంటి ప్రముఖులు ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు.పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి. చిట్టిబాబు, చిలకా చంద్రశేఖర్ మరియు ఇతర ప్రతినిధులు ఈ సభలను పర్యవేక్షిస్తారని తెలిపారు.
సభలో భాగంగా రెండో రోజు ప్రతినిధుల సభ జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు.
ముగింపు సభలో వివిధ ప్రజా సంఘాల నేతలు, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎ.కె. బాషా తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు.
ఈ మహాసభలను విజయవంతం చేయాలని ప్రజాస్వామ్యవాదులను వారు కోరారు.ఈ కార్యక్రమంలో విరసం నాయకులు అరసవల్లి కృష్ణ,మంజరి లక్ష్మి(సి.ఎం.ఎస్),కె.కృష్ణ(కెఎన్పీఎస్),రివేరా(విరసం),కె.పోలారి (ఐఎఫ్టీయు) తదితరులు పాల్గొన్నారు.




