నందిగామ డివిఆర్ ఏరియా హాస్పిటల్‌లో రూ.35 లక్షల అల్ట్రా సౌండ్ ల్యాబ్ ప్రారంభం.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు.
నందిగామ పట్టణంలోని డివిఆర్ ఏరియా హాస్పిటల్‌లో శనివారం నాడు రూ.35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన అల్ట్రా సౌండ్ ల్యాబ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి, హాస్పిటల్ కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, కూటమి నేతలు, వైద్యాధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఏడు ప్రభుత్వ ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్ ల్యాబ్‌లను మంజూరు చేయగా అందులో నందిగామ డివిఆర్ ఏరియా హాస్పిటల్ ఒకటిగా ఎంపిక కావడం ఆనందకరమని తెలిపారు. ఇందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి,
వైద్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారికి నందిగామకు అల్ట్రా సౌండ్ ల్యాబ్ మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అల్ట్రా సౌండ్ ల్యాబ్ ద్వారా గర్భిణులు, మహిళలు, పేద ప్రజలకు స్థానికంగానే కీలక వైద్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రజలకు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ఈ చక్కటి అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని ఆమె కోరారు, అనంతరం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కమిటీ సభ్యులు, వైద్యులు, అధికారులు, కూటమి నేతలు,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




