విజయవాడ నగరపాలక సంస్థ
27-12-2025
ఈ పార్క్ ప్రజలది దీన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా స్థానికులదే -MLA బొండా ఉమ*
పార్కుల చుట్టూరు ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసి నిరంతరం సీసీ కెమెరాలు ద్వారా పర్యవేక్షిస్తూ అల్లరి మూకలను నియంత్రిస్తాం*
ఈ పార్క్ ప్రజలది దీన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా స్థానికులదే అని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ LBS నగర్ వికలాంగుల హాస్టల్ వద్ద, 33 వ డివిజన్ ముత్యాలంపాడు, అల్లూరి సీతారామరాజు పార్క్ వద్ద ఏలూరు గట్టుమీద అభివృద్ధి చేసిన పార్క్ ను బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లలో ఉన్న ఓపెన్ ప్లేసులు, పార్కులను పూర్తిగా ఆధునీకరించి ప్రజల వినియోగంలోకి తీసుకువస్తున్నామని, ఎంత ఖర్చైనా స్థానిక మహిళలు, సీనియర్ సిటిజన్లు, పిల్లలు సహా అందరికీ ఉపయోగపడే విధంగా పార్కులను అభివృద్ధి చేయడమే NDA ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
62వ డివిజన్, ఎల్బీఎస్ నగర్‌లోని విజయవాడ నగరపాలక సంస్థ ₹43 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఉద్యానవనం అభివృద్ధి చేశారని, ముత్యాలంపాడు ఏలూరు కాలువ గట్టు వద్ద 15 వ సాధారణ నిధులతో ఒక కోటి రూపాయల వ్యయంతో ప్రజల కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు పార్కులను అభివృద్ధి చేశారని అన్నారు. గతంలో చెత్త, దుర్వాసనతో నిండి ఉపయోగం లేకుండా ఉండేదని, ఎన్నికల సమయంలో స్థానికులు ఈ పార్కును అభివృద్ధి చేయాలని తనను కోరారని, ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ పార్కులను పూర్తిగా ఆధునీకరించామని అన్నారు.
ఈ పార్క్ల అభివృద్ధితో పిల్లలు రోడ్లపై ఆడకుండా సురక్షితమైన ప్లే ఏరియాలో ఆడుకునే అవకాశం కల్పించామని, మహిళలు, యువత కోసం ఆధునిక జిమ్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేశామని, అలాగే సీనియర్ సిటిజన్లు నడక చేయడానికి అనుకూలంగా సాండ్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసారని అన్నారు.
ఈ పార్క్‌ను కేవలం నిర్మించి వదిలేయకుండా, నిరంతర నిర్వహణ కోసం స్థానికులతో కలిసి కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఫుల్‌టైమ్ స్థానిక వాచ్‌మన్‌ను నియమించి పార్క్ ఎలాంటి నష్టం చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు, అవసరమైన చోట ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ పార్క్ లో ప్రజలు చెత్త వేయరాదని, సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని, తడి చెత్త, పొడి చెత్త సేకరణకు ఇప్పటికే సిబ్బంది రోజూ ఇంటి వద్దకే వస్తున్నారని, అయినా పార్కుల్లో చెత్త వేయడం సరికాదని ప్రజలను కోరారు.
ఈ పార్కులో స్థానిక కమిటీతో సమావేశం నిర్వహించి, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తామని, ప్రజల ఆరోగ్యం పరిరక్షణ, ఆనందకరమైన జీవన విధానం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఎల్బీఎస్ నగర్ పార్కును అందరూ ఆహ్లాదకర వాతావరణంలో సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు అలంపూరు విజయలక్ష్మి, శర్వాణి మూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (పార్క్స్) ప్రభాకర్, డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి
విజయవాడ నగరపాలక సంస్థ




