Monday, December 29, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshనూతన సంవత్సరం వేడుకలు సురక్షితంగా జరగాలి – పోలీసుల సూచన |

నూతన సంవత్సరం వేడుకలు సురక్షితంగా జరగాలి – పోలీసుల సూచన |

కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదకరంగా గడిపే విధంగా బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలు ఉండాలి. నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే ఈవెంట్స్‌కు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలి. రిసార్ట్స్, రెస్టారెంట్లలో లిక్కర్ పార్టీలకు అనుమతి లేదు
అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
యాత్రికుల భద్రతకు ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నాం.

అతిథులుగా వచ్చే యాత్రికుల భద్రత బాధ్యత నిర్వాహకులదే
రాత్రి సమయాల్లో బీచ్ ఏరియాలలో ఎవరు ఉండకూడదు
ప్రతి రిసార్ట్, రెస్టారెంట్, హోటల్‌లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలి. అవి బీచ్ వ్యూ‌ను క్యాప్చర్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయాలి
పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న బాపట్ల జిల్లాకు మంచి గుర్తింపు వచ్చే విధంగా నడుచుకోవాలి
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.

బాపట్ల: నూతన సంవత్సరం, ఇతర వేడుకల సందర్భంగా రిసార్ట్స్, రెస్టారెంట్లు, హోటళ్లలో ఏవైనా కార్యక్రమాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. లిక్కర్ పార్టీలకు అనుమతి లేదని, అటువంటివి ఎవరైనా నిర్వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. చట్ట వ్యతిరేకంగా ఏవైనా కార్యక్రమాలు చేపడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

శనివారం జిల్లా పోలీస్ క్యాంప్ కార్యాలయ సమావేశ హాలులో బాపట్ల జిల్లా పరిధిలోని ప్రధానంగా సూర్యలంక, పాండురంగాపురం, వాడరేవు, రామాపురం బీచ్‌లు తదితర ముఖ్య ప్రదేశాలలో ఉన్న రిసార్ట్స్, హోటల్ నిర్వాహకులతో జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ బాపట్ల జిల్లాకు విశాలమైన సముద్ర తీరం ఉందన్నారు. జిల్లాలో సుమారు 60 రిసార్ట్స్, హోటల్ లు ఉన్నాయని, ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు.

ఈ ప్రాంతాలకు చుట్టుపక్క జిల్లాలతో పాటు తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో యాత్రికులు వస్తుంటారన్నారు. ప్రభుత్వం కూడా బాపట్ల జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికా పరంగా ముందుకు వెళ్తోందన్నారు. సూర్యలంక సముద్ర తీరాన్ని మరింత పర్యాటక సుందరంగా తీర్చిదిద్దేందుకు ఇటీవల ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేయడం జరిగిందన్నారు.

పర్యాటకంగా అభివృద్ధి చెందడంలో రిసార్ట్స్, హోటల్ నిర్వాహకులు కూడా భాగస్వాములు కావాలని, జిల్లాకు పర్యాటకంగా రాష్ట్రంలో మంచి పేరు రావాలనేదే ముఖ్య ఉద్దేశమన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న బాపట్ల జిల్లాకు యాత్రికులు కుటుంబ సమేతంగా, స్నేహితులతో, బంధువులతో వచ్చి ఆహ్లాదకరంగా గడిపే విధంగా ఇక్కడి పరిస్థితులు ఉండాలన్నారు. ఆ దిశగా రక్షణ పరమైన భద్రతా చర్యలను చేపడుతున్నామని తెలిపారు. ఇతర ప్రాంతాలలో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఇక్కడ జరగడానికి వీలులేదని, యాత్రికులకు మంచి వాతావరణం కల్పించాలన్నారు.

సముద్ర తీర ప్రాంతాలలో ఉన్న హోటళ్లు, రిసార్ట్స్, రెస్టారెంట్ నిర్వాహకులు నూతన సంవత్సరం, ఇతర సందర్భాలలో కార్యక్రమాలు నిర్వహించేందుకు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి అనుమతి పొందాలని తెలిపారు. లిక్కర్ పార్టీలు నిర్వహించరాదని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇతర ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు ఏ రిసార్ట్స్ లేదా హోటళ్లలో బస చేస్తారో, సంబంధిత నిర్వాహకులే వారి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సముద్ర తీర ప్రాంతాలలో ఎలా ఉండాలి, చేయవలసినవి, చేయకూడని పనులు, అత్యవసర సమయాలలో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు వంటి వివరాలతో కూడిన బోర్డులను యాత్రికులకు కనిపించే విధంగా రిసెప్షన్ వద్ద, డైనింగ్ ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని తెలిపారు.

స్విమ్మింగ్ పూల్ వద్ద ఈత కొట్టేందుకు యాత్రికులు ఇష్టపడుతూ ఉంటారని, యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాటి వద్ద తప్పనిసరిగా గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలన్నారు. మద్యం సేవించి ఎవరు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. యాత్రికులు రాత్రి సమయాలలో ఒంటరిగా సముద్రంలోకి వెళ్లరాదని తెలియజేయాలన్నారు.

మైనర్లు మాత్రమే వచ్చి రిసార్ట్స్, రెస్టారెంట్లు, హోటళ్లలో రూములు కోరితే వారికి ఇవ్వవద్దని సూచించారు. డిసెంబర్ 31 రాత్రి నుండి సంక్రాంతి పండుగ ముగిసే వరకు, ఆ తర్వాత కూడా సముద్ర తీర ప్రాంతాలలో ఎటువంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగడానికి వీలు లేదన్నారు. రిసార్ట్స్, హోటళ్లు, రెస్టారెంట్ల పరిధిలో గానీ, వారు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తులు గానీ ఏవైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.

బీచ్ రిసార్ట్ యజమానులకు సూచనలు
➤ అతిథులుగా వచ్చిన వారి వివరాలను సవివరంగా రిజిస్టర్‌లలో పొందుపరచాలి➤ గుర్తింపు పత్రాలను సరిగా పరిశీలించాలి➤ అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి
భద్రతా చర్యలు

➤ ప్రాంగణంలో తగినంత ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి➤ ప్రవేశ / నిష్క్రమణ ద్వారాలు, పార్కింగ్, హాల్ తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండాలి, అవి సక్రమంగా పనిచేసే విధంగా చూసుకోవాలి➤ కనీసం 30 రోజులు సీసీ కెమెరా ఫుటేజ్ నిల్వ చేయాలి➤ స్విమ్మింగ్ పూల్ వద్ద గార్డులను ఏర్పాటు చేయాలి➤ పార్కింగ్, మార్గాలు సహా అన్ని ప్రాంతాల్లో సరైన లైటింగ్ ఉండాలి

నిషేధిత కార్యకలాపాలు
➤ డ్రగ్స్ / నార్కోటిక్స్ / జూదం / అశ్లీల కార్యక్రమాలు నిషేధం➤ బాణాసంచా పేల్చడం నిషేధం➤ సమీప నివాసితులకు ఇబ్బంది కలిగించే ఈవెంట్లు నిషేధం
ఈవెంట్ అనుమతులు

➤ డీజే, పార్టీలు, ప్రత్యేక కార్యక్రమాలకు ముందస్తు రాతపూర్వక పోలీస్ అనుమతి తప్పనిసరి➤ శబ్ద కాలుష్య నిబంధనలు పాటిస్తూ నిర్ణీత సమయాల్లోనే కార్యక్రమాలు ముగించాలి➤ ప్రాంగణం బయట లేదా ఓపెన్ బీచ్‌లో అనధికార పార్టీలకు అనుమతి లేదు
పార్కింగ్ మరియు ట్రాఫిక్

➤ వాహనాలను పూర్తిగా రిసార్ట్ లేదా హోటల్ ప్రాంగణంలోనే పార్క్ చేయాలి➤ రహదారులు లేదా ప్రజా ప్రదేశాల్లో అడ్డంగా ఉంచరాదు➤ ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరించాలి
బీచ్‌కు సమీపంలోని రిసార్ట్స్‌కు ప్రత్యేక సూచనలు
➤ రాత్రి సమయాల్లో సముద్రంలోకి వెళ్లవద్దని అతిథులకు సూచించాలి➤ లైఫ్ గార్డులు / పోలీస్ పట్రోలింగ్‌తో సమన్వయం చేయాలి➤ రాత్రివేళల్లో ఒంటరిగా బీచ్ ప్రాంతాలకు వెళ్లడాన్ని నిషేధించాలి➤ ఏదైనా సంఘటన జరిగితే పూర్తి బాధ్యత యజమానులు / నిర్వహకులదే ➤ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, రిసార్ట్ మూసివేత లేదా క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి

ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు, చీరాల డీఎస్పీ ఎం.డి. మోయిన్, సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్, ఎస్‌బీ సీఐ జి. నారాయణ, బాపట్ల రూరల్ స్టేషన్ సీఐ కె. శ్రీనివాసరావు, చీరాల రూరల్ సర్కిల్ సీఐ పి. శేషగిరి, బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న రిసార్ట్స్, హోటల్ యజమానులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

#నరేంద్ర

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments