యోగ అభ్యసనం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం… యోగ, క్రీడల ద్వారా విద్యార్థులకు బహుళ ప్రయోజనాలు…. బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు బాపట్ల జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ డా.వి.వినోద్ కుమార్.
బాపట్ల: యోగ అభ్యసనం క్రమం తప్పకుండా చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించి, మెరుగైన మరియు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుందని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు.
44వ జాతీయస్థాయి యోగాసనా ఛాంపియన్షిప్ పోటీలను జిల్లెళ్ళమూడి విశ్వ జనని పరిషత్ ట్రస్ట్ ఆవరణలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తో కలిసి బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభలో ఆయన ప్రధాన వక్తగా ప్రసంగిస్తూ రోజువారి జీవితంలో ప్రతి ఒక్కరు ఎంతో ఒత్తిడితో, పలు రకాల పనులలో నిమగ్నమై ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారని, కానీ యోగ అభ్యసనం క్రమం తప్పకుండా చేసినట్లయితే అనేక జీవనశైలి సంబంధిత అనారోగ్యాలకు దూరంగా ఉంటారని సూచించారు.
నిబద్ధత, క్రమశిక్షణ తో కూడిన యోగా అభ్యసనం ప్రతి ఒక్కరికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తుందని అన్నారు.
అదేవిధంగా విద్యార్థులకు యోగా, క్రీడలలో రాణించడం వలన వారి ఆరోగ్యం మెరుగుగా ఉండడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు, వృత్తి గత ప్రయోజనాలు మరియు ఎదుగుదల సాధ్యమవుతుందన్నారు.
అందుచేత కేవలం చదువుకు పరిమితం కాకుండా విద్యార్థులు యోగా కరాటే క్రీడలు వంటి వివిధ రంగాల పట్ల కూడా మక్కువ పెంచుకొని అభ్యసనం చేయాల్సిందిగా సూచించారు.
భారతదేశం యోగ విద్యలో ప్రపంచానికి మార్గదర్శిగా ఉన్నదని, ప్రపంచ యోగా దినోత్సవాన్ని భారతదేశం ఎంతో గర్వంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని చెప్పారు.
యోగా విశిష్టతను గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని, అయితే వర్తమాన భావితరాలు ఆరోగ్యకరంగా మనుగడ సాగించాలంటే కచ్చితంగా యోగ అభ్యసనం చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు.
ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు జవాబుదారీగా, బాధ్యతాయుతంగా, నిరంతరం అందుబాటులో ఉండేలా తన జీవన ప్రణాళికను కొనసాగిస్తున్న క్రమంలో, యోగ అభ్యసనంలో క్రమశిక్షణ లోపిస్తోందని కొంత ఆవేదన వ్యక్తం చేశారు.
అయినప్పటికీ నెలలో 15 రోజుల పాటు యోగ, జిమ్ , వ్యాయామం కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
దేశంలోని పలు రాష్ట్రాల నుండి యోగా పోటీలకు హాజరయ్యేందుకు బాపట్లకు తరలిరావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్ కు తాను అండగా ఉన్నానని ఉంటానని రాబోయే రోజులలో ఎలాంటి కార్యక్రమం చేపట్టిన తన వంతు సహాయ సహకారాలను తప్పక అందిస్తానని సభాముఖంగా ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ యోగ ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజి భూషణ్ పురోహిత్ , ప్రధాన కార్యదర్శి మృణాల్ చక్రబోర్తి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్ అధ్యక్షులు కూన కృష్ణదేవరాయలు.
చైర్మన్ కళ్ళం హరినాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లాడి రవికుమార్, విశ్వ జనని పరిషత్ గౌరవాధ్యక్షులు ఎం దినకర్, బి రవీంద్రబాబు మరియు బౌడ చైర్మన్ మరియు టిడిపి బాపట్ల జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు, నరేగా మాజీ కౌన్సిల్ సభ్యురాలు మొవ్వ లక్ష్మి సుభాషిని, వివేక సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు
శీలం శ్రీనివాసరావు, అసోసియేషన్ కోఆర్డినేటర్ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ, సభ్యులు యార్లగడ్డ లక్ష్మీనారాయణ రెడ్డి నాగరాజు, ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు
#నరేంద్ర




