పోటాపోటీగా జాతీయ స్థాయి యోగాసనా పోటీలు క్షేత్రస్థాయికి “యోగ” ఫలాలు చేర్చేందుకు ఇండియన్ యోగా ఫెడరేషన్ కృషి.. అభ్యర్థుల యోగ ప్రదర్శనలతో కోలాహలంగా మారిన జిల్లెళ్ళమూడి
జాతీయ అధ్యక్షులు బ్రిడ్జిభూషణ్, కార్యదర్శి మృణాల్ చక్రవర్తి
బాపట్ల: జాతీయ స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ 2025 పోటీలు అత్యంత ఉత్కంఠ భరితంగా, పోటాపోటీగా కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్థులు జాతీయ స్థాయిలో తమ సత్తాను చాటేందుకు ఉత్సాహంతో ఉరకలెత్తారు.
వయసు వారిగా, విభాగాల వారీగా జరిగిన యోగాసన పోటీలలో ఆకాశమే హద్దుగా తమ ప్రతిభను జాతీయస్థాయి వేదికపై న్యాయమూర్తుల సమక్షంలో ప్రదర్శించారు.
దేహాన్ని ధనస్సులా మార్చి, ఆసనాలను శరాలుగా సంధించిన అభ్యర్థులు ఉత్తమ శ్రేణి ప్రతిభ కనబరచి పలు ఆసనాలతో వీక్షకులకు కనువిందు చేశారు.
ఇండియన్ యోగ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్, ప్రధాన కార్యదర్శి మృణాల్ చక్రవర్తి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగా అసోసియేషన్ చైర్మన్ కళ్ళం హరినాద్ రెడ్డి, అధ్యక్షులు కూన కృష్ణదేవరాయులు, ప్రధాన కార్యదర్శి అల్లాడి రవికుమార్, అసోసియేషన్ సభ్యులు శీలం శ్రీనివాసరావు, రెడ్డి నాగరాజు తదితరులు పోటీలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
భారతదేశం యోగాకు విశ్వ గురువు వలె, తరతరాలుగా యోగ విద్యను భావితరాలకు అందిస్తూ ముందుకు సాగుతున్నదని, అయితే మరింతగా యోగ సాధనను విస్తృతపరచి క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని గత 44 సంవత్సరాలుగా ఇండియన్ యోగ ఫెడరేషన్ కృషి చేస్తున్నదని జాతీయ అధ్యక్షులు బ్రిడ్జిభూషణ్, కార్యదర్శి మృణాల్ చక్రవర్తి స్పష్టం చేశారు.
జాతీయ యోగాసనా ఛాంపియన్షిప్ కార్యక్రమంలో వీరు మీడియాతో మాట్లాడుతూ…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసోసియేషన్ తరఫున బాపట్ల జిల్లా జిల్లెల్లమూడి వేదికగా ఒక ఉత్సవం లాగా పోటీలు జరగడం పట్ల సంతృప్తి, సంతోషం వ్యక్తం చేశారు.
యోగ అంటే ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమం అనే భావన చాలామందిలో ఇప్పటికీ నెలకొని ఉన్నదని, కానీ “యోగాసనం” ఆరోగ్యప్రదాయని అని వ్యాఖ్యానించారు.
దేహాన్ని వజ్ర సదృశ్యంగా మార్చి శరీర సౌష్టవాన్ని అంతర్గత ఆరోగ్యాన్ని మెరుగుపరిచే “యోగాసనం” యొక్క గొప్పతనాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నదే తమ అభిమతం అన్నారు.
భారత ప్రభుత్వం యోగ పట్ల చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ ఎంతగానో ప్రశంసనీయమని, రాబోయే రోజులలో ప్రభుత్వంతో కలిసి మరిన్ని కార్యక్రమాలను చేపట్టటానికి ఇండియన్ యోగా ఫెడరేషన్ సమాయత్తమవుతోందని వివరించారు.
ప్రజలలో యోగ పట్ల మక్కువ పెరిగేలా, అపోహలు తొలగేలా, అందరి భాగస్వామ్యం పెంపొందించేలా ప్రతి ఏటా జాతీయస్థాయి యోగాసన ఛాంపియన్షిప్ ను కొనసాగిస్తున్నామని తెలియజేశారు.
#నరేంద్ర




