గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని, ప్రజలు అందించే ఫిర్యాదులు, అర్జీలను విభాగాధిపతులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువు మేరకు పరిష్కరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు.
సోమవారం డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ లో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెస్తే త్వరగా పరిష్కారమవుతాయనే ఆశతో వస్తారని, అందుకు తగిన విధంగా సత్వర పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు.
కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 12 ఫిర్యాదులు తీసుకొని, అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేయాలన్నారు.
డయల్ యువర్ కమిషనర్ కి అందిన ఆర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ చాంబర్ కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొన్న కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ పిజిఆర్ఎస్, ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలన్నారు.
సోమవారం జరిగే కార్యక్రమానికి గత వారం అందిన ఫిర్యాదులు పరిష్కార నివేదికతో అధికారులు హాజరుకవాలన్నారు. అర్జీలు బియండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లడానికి వీలులేదన్నారు.
ప్రతి విభాగంలో పిజిఆర్ఎస్, గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాలన్నారు. అర్జీల పరిష్కారంపై జిఎంసి పిఎంయు బృందం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు ఆర్జీలను నేరుగా వెళ్లి పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు.
పిజిఆర్ఎస్ ద్వారా 31 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 7, ఇంజినీరింగ్ విభాగం 11, రెవెన్యూ విభాగం 7, ప్రజారోగ్య విభాగం 4, ఉపా సెల్ విభాగం 1, పరిపాలన విభాగానికి సంబందించి 1 ఫిర్యాదు అందాయన్నారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, సిటి ప్లానర్ రాంబాబు, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నారాయణ, మేనేజర్ బాలాజీ బాష పాల్గొన్నారు.
