మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ : జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప కాలనీలో నెలకొన్న విద్యుత్ బకాయిల సమస్య పరిష్కారం కోసం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సోమవారం కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని కలిశారు.షాపూర్ నగర్లోని ఆయన నివాసంలో కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
కాలనీ వాసుల కథనం ప్రకారం.. రాజీవ్ గృహకల్పలో తాగునీటి సరఫరా కోసం ఉపయోగిస్తున్న విద్యుత్ మోటార్లకు సంబంధించి భారీగా బిల్లులు బకాయి పడ్డాయి. గతంలో ఉన్న కమిటీ ప్రతి ఇంటి నుండి కరెంట్ బిల్లుల కోసం నగదు వసూలు చేసినప్పటికీ, ఆ మొత్తాన్ని విద్యుత్ శాఖకు చెల్లించడంలో వైఫల్యం చెందారని బాధితులు తెలిపారు.
బకాయిలు చెల్లించని పక్షంలో మోటార్ల కనెక్షన్లను కట్ చేస్తామని విద్యుత్ అధికారులు హెచ్చరించడంతో, కాలనీలో తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
కాలనీ వాసుల సమస్యను సావధానంగా విన్న కూన శ్రీశైలం గౌడ్ సానుకూలంగా స్పందించారు. వేలాది కుటుంబాలు నివసించే రాజీవ్ గృహకల్పలో తాగునీటి సరఫరా నిలిచిపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. తక్షణమే ఈ విషయంపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి, కనెక్షన్లు కట్ కాకుండా చూస్తానని, బకాయిల చెల్లింపు విషయంలో తగిన వెసులుబాటు కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సమస్య పరిష్కారానికి చొరవ చూపుతున్న శ్రీశైలం గౌడ్ కు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ నివాసితులు కృతజ్ఞతలు తెలిపారు.
#sidhumaroju




