క్యూలైన్లో భక్తుల కష్టాలు.
త్రాగేందుకు నీళ్లు లేక భక్తుల అవస్థలు
సిఫారసులకే పెద్దపీట
మంగళగిరి* వైకుంఠ ఏకాదశి (మంగళగిరి ముక్కోటి) ఉత్సవానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. క్యూ లైన్ లలో మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉంచామని ఆలయ అధికారులు తొలుత ప్రకటించారు. ఉత్తర ద్వార దర్శనం శంకు తీర్థం కోసం వచ్చే భక్తులు మంచి నీళ్లు లేక ఇబ్బందులు పడ్డారు. ఒంటి గంటకు ఆలయంలోకి వెళ్తే 4 గంటలకు బయటికి వచ్చా కనీసం మంచినీళ్లు లేక కళ్ళు తిరిగాయి అంటూ ఓ మహిళా భక్తురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
*అవును అందరూ విఐపిలే*
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 100 200లతో పాటు 500 రూపాయల టికెట్లను ఆలయ అధికారులు అందుబాటులో ఉంచారు. రూ.500 టిక్కెట్ కొనుగోలు చేసిన వారిని వంద రూపాయలు, రెండు వందల రూపాయలు క్యూ లైన్ లో పంపించటం విమర్శలకు తావిచ్చింది. కనీసం 500 రూపాయలు పెట్టి టికెట్ కొనుగోలు చేసిన వారికి మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారా అంటూ పలువురు ప్రశ్నించారు.
*తెలిసినవారైతే ఓకే*
యధా విధిగా ఈ సారి ముక్కోటి పర్వదినం నాడు సైతం సిఫారసులకే ఆలయ అధికారులు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. పరిచయం ఉన్న వారిని ప్రత్యేక మార్గం ద్వారా పంపించటం సాధారణంగా జరిగిపోయింది. ఉత్సవ నిర్వహణలో ప్రణాళిక బద్ధమైన చర్యలు లోపించటం కొట్టొచ్చినట్లు కనిపించింది.
*శంకు తీర్థం తీసుకోకుండా వెళ్లిన సామాన్య భక్తులు ఎందరో!*
ముక్కోటి ఉత్సవానికి శంకు తీర్థం కోసం వచ్చిన సామాన్య భక్తులు ఎందరో నిరాశతో వెను తిరగాల్సి వచ్చింది. క్యూలైన్ ఎంతసేపటికి ముందుకు సాగకపోవడం భారీ సంఖ్యలో ఆలయం లోపల భక్తులు నిలిచి వుండటం వలన ఎక్కువసేపు నిరీక్షించలేక వెనుతిరిగి వెళ్ళవలసి వచ్చింది. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
*ఆ ఇద్దరు సోదరుల చేతుల్లోనే తాళాలు!*
విఐపి దర్శన గేటు తాళాలు ఇద్దరు సోదరుల చేతుల్లో ఉండటం చర్చనియాంశంగా మారింది. వారి ఆశీస్సులు మెండుగా ఉన్న వారికే అవకాశం దక్కినట్లు అవుతుందన్న విమర్శలు వెళ్ళు వెత్తుతున్నాయి.
*ప్రత్యేక స్లాట్ ప్రకటనకే పరిమితం*
ప్రభుత్వ అధికారులకు, మీడియా ప్రతినిధులకు దర్శన సదుపాయం కల్పించేందుకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు స్లాట్ కేటాయించినట్లు తొలుత అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటన కేవలం ప్రచారానికే పరిమితమైంది తప్ప అమలుకు నోచుకోలేదు. ముక్కోటికి ముందు కోఆర్డినేషన్ మీటింగ్ కేవలం మొక్కుబడిగా నిర్వహించినట్లు ప్రస్తుతం ఉత్సవ నిర్వహణ తీరును బట్టి స్పష్టంగా తెలుస్తోంది.




