అటెన్షన్ ఆదాయం మాయలో గీత దాటిపోతున్న ఇన్‌ఫ్లూయన్సర్స్
సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ‘ఇన్‌ఫ్లుయెన్సర్’ సంస్కృతి వేగంగా విస్తరించింది. కానీ కొంత మమంది భావ ప్రకటనా స్వేచ్ఛను ఆసరాగా చేసుకుని కొందరు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుండటం సమాజానికి ఆందోళన కలిగించే విషయంగా మారుతోంది. భారత రాజ్యాంగం మనకు భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించింది, కానీ అది పరిమితులు లేనిది కాదు. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నప్పుడు, వారు మాట్లాడే ప్రతి మాట సమాజంపై, ముఖ్యంగా యువతపై బలమైన ముద్ర వేస్తుంది. కేవలం వ్యూస్ కోసం, సంచలనం కోసం దేశ ప్రతిష్టను దిగజార్చడం లేదా మతపరమైన మనోభావాలను గాయపరచడం చేస్తున్నారు. సమాజాన్ని కించ పరుస్తున్నారు.
విలువల కంటే క్లిక్ బేట్ కే ప్రాధాన్యత:
ప్రస్తుతం సోషల్ మీడియాలో అటెన్షన్ ఎకానమీ నడుస్తోంది. అంటే ఎవరికైతే ఎక్కువ అటెన్షన్ వస్తుందో వారికి అంత ఆదాయం వస్తుంది. ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దేవుళ్లను కించపరచడం లేదా వ్యవస్థలను తప్పు పట్టడం , వావి వరుసలు లేని జోకుల ద్వారా త్వరగా పాపులారిటీ సంపాదించవచ్చని కొందరు భావిస్తున్నారు. ఈ షార్ట్ కట్ పద్ధతి వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. విద్వేషం పెరగడమే కాకుండా, తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తోంది. బాధ్యతాయుతమైన ఇన్‌ఫ్లుయెన్సర్లు సమాజానికి దిశానిర్దేశం చేయాలి కానీ, దారి తప్పించకూడదు.
చట్టాలు వర్తిస్తాయి !
సోషల్ మీడియా అంటే చట్టాలకు అతీతమైన ప్రపంచం కాదు. ఐటి చట్టం , కొత్తగా వస్తున్న డిజిటల్ మీడియా నిబంధనల ప్రకారం.. దేశ సార్వభౌమాధికారానికి, ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కోర్టు మెట్లు ఎక్కడం, వారి అకౌంట్లు డిలీట్ అవ్వడం మనం చూస్తున్నాం. వ్యక్తిగత ఎదుగుదల కోరుకోవడంలో తప్పు లేదు కానీ, అది సమాజ క్షేమానికి వ్యతిరేకంగా ఉండకూడదు. నా అన్వేషణ..అన్వేష్ ఒక్కడే కాదు.. చాలా మంది ఉన్నారు.
వీక్షకుల బాధ్యత కూడా ముఖ్యం
ఇన్‌ఫ్లుయెన్సర్ల దారి తప్పడానికి వీక్షకులు ఇచ్చే ప్రోత్సాహం కూడా ఒక కారణం. వివాదాస్పద కంటెంట్‌ను చూసినా, షేర్ చేసినా వారికి మరింత బలం చేకూరుతుంది. సమాజానికి మేలు చేసే, జ్ఞానాన్ని పంచే వ్యక్తులను ఆదరించడం ,తప్పుడు దారిలో నడిపించే వారిని డిజిటల్ బాయ్ కాట్ ద్వారా తిరస్కరించాలి.
అలా చేస్తే సోషల్ మీడియాలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకురాగలం. ప్రతి ఇన్‌ఫ్లుయెన్సర్ తన కెమెరా ముందు మాట్లాడే ముందు, తన మాట లక్షలాది ఇళ్లలోకి చేరుతుందనే కనీస సామాజిక బాధ్యతను గుర్తించాల్సి ఉంది. సోషల్ మీడియా యుగంలో విలువల్ని కాపాడుకోవడం చాలా కష్టం. కానీ అదే కారణంతో అన్నీ తెంపేసుకుని రోడ్డు మీద పడిపోకూడదు.




