ఏపీ ప్రభుత్వం కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరుకుంది. ఈ కొత్త జిల్లాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. మార్కాపురం జిల్లా కేంద్రంగా మార్కాపురం జిల్లా, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటవుతాయి.
ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రంపచోడవరం ప్రధాన కార్యాలయంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయగా… మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారు.
నేటి నుంచే అమల్లోకి..
డిసెంబర్ 31 నుంచి జిల్లా పునర్వ్యవస్థీకరణ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. పునర్వ్యవస్థీకరణ వ్యాయామంలో భాగంగా రెవెన్యూ డివిజన్లు మరియు మండలాల సరిహద్దులలో మార్పులు కూడా నోటిఫికేషన్ లో ఉన్నాయి.
రాష్ట్రంలో 2 కొత్త జిల్లాల ఏర్పాటుతో వీటి సంఖ్య 28కి చేరింది. ఈ కొత్త జిల్లాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా మార్కాపురం జిల్లా ఏర్పాటైంది. ప్రజల డిమాండ్ మేరకు నెల్లూరుకి గూడూరు, తిరుపతికి రైల్వే కోడూరుకు వెళ్లాయి.
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరును వాసవీ పెనుగొండగా మార్చారు.
గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాల్ని శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాలో కలిపారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు, బాపట్ల జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో ఉంటాయి.
అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుతుంది.
ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్ కడప జిల్లాలోకి, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలుస్తాయి.
నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలి డివిజన్‌కు మార్చారు.
సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దపురం డివిజన్‌కు మార్చారు.
అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్‌తో రెవెన్యూ డివిజన్ ఏర్పాటవుతుంది.
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఏపీలో ఎక్కువ మండలాలు కలిగిన జిల్లాగా వైఎస్ఆర్ కడప(40) జిల్లా నిలవనుంది.
జనాభా విషయానికి వస్తే ఏపీలో అత్యధిక జనాభా ఉన్న జిల్లాగా తిరుపతి ఉంటుంది.
జనాభా పరంగా రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా పోలవరం నిలుస్తోంది






